కేజీబీవీ ఘటనపై సీరియస్ యాక్షన్

  • ఫుడ్​ పాయిజన్​కు బాధ్యులైన స్పెషల్​ ఆఫీసర్​ జయశ్రీ , ఐదుగురు కుక్ ల తొలగింపు
     

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ కేజీబీవీలో ఇటీవల జరిగిన ఫుడ్​ పాయిజనింగ్ ​ఘటనలో బాధ్యులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో జరిగిన వరుస ఘటనలకు బాధ్యులుగా భావించి స్పెషల్​ ఆఫీసర్​ జయశ్రీతో పాటు, ఐదురుగురు కుక్ లను అదేరోజు సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత వీరందరినీ విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేజీబీవీ సెక్టోరియల్​ ఆఫీసర్​ ఉదయశ్రీ తెలిపారు. వీరితో పాటు మరో 17 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలియజేశారు. ఇందులో 14 మంది సీఆర్టీ, పీజీసీఆర్టీలు కాగా ఒక పీఈటీ, ఏఎన్ఎం, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. కేజీబీవీలో అన్నం తిని ఈ నెల25వ తేదీన 11 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురికాగా, స్థానిక ప్రైమరీ హెల్త్​ సెంటర్​తో పాటు రిమ్స్​కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. 

కాగా, అన్నంలో  పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయంటూ అదే రోజూ స్టూడెంట్లు స్కూల్ ​బిల్డింగ్​పైకెక్కి ఆందోళన చేశారు. ఈఘటన జరిగిన తర్వాత కూడా స్కూల్​స్టాఫ్​ తీరు మారలేదు. వరుసగా రెండు రోజు ఉదయం టిఫిన్​ తిన్న 25 మందికి ఫుడ్​ పాయిజన్​కావడంతో  రిమ్స్​కు తరలించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు స్కూల్​దగ్గర ఆందోళన చేయడంతో డీఈఓ, ఇతర ఉన్నతాధికారులు కేజీబీవీ చేరుకొని ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా వారి ముందు వండిన అన్నంలోనూ పురుగులు రావడంతో అధికారులు స్పెషల్​ ఆఫీసర్​ జయశ్రీని, ఐదుగురు వంట మనుషులను అక్కడే సస్పెండ్​చేశారు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకొని తాజాగా బాధ్యులందరినీ టెర్మినేట్ ​చేశారు.