
ఫిబ్రవరి 2022లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో ఆ రెండు దేశాలే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల మీద ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ని ‘ప్రపంచపు బ్రెడ్ బాస్కెట్’ అని పిలుస్తారు. ఉక్రెయిన్‌లో పొద్దుతిరుగుడు, గోధుమ, మొక్కజొన్న బాగా పండుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. అంతెందుకు ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న మన దేశం మీద కూడా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. కొన్ని రోజుల పాటు వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటన్నింటికీ కారణం ఏంటంటే.. యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్‌లోని నౌకాశ్రయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది రష్యా. సముద్రమార్గాలను కూడా నిలిపివేసింది. చాలావరకు ఎక్స్పోర్ట్స్ఆగిపోయాయి. వరల్డ్ ఫుడ్ సప్లయ్ చైయిన్ను చక్కదిద్దేందుకు ఐక్యరాజ్య సమితి, టర్కీ ఓ అడుగు ముందుకేసి రెండు దేశాలను చర్చలకు పిలిచాయి. ఈ రెండు దేశాల మధ్య జులై 2022లో ఒక ఒప్పందం కుదిర్చాయి. దాన్నే ‘నల్ల సముద్రం ఒప్పందం’ అంటారు. ఎందుకంటే.. ఉక్రెయిన్ నుంచి వెళ్లే ఇంటర్నేషనల్ షిప్లు ఈ నల్ల సముద్రం మీదుగానే ఇతర దేశాలకు వెళ్తాయి.
సేఫ్ కారిడార్
ఈ ఒప్పందం ప్రకారం.. ఆహారధాన్యాలను తీసుకెళ్లే నౌకలకు మూడు ఉక్రేనియన్ ఓడరేవులకు - ఒడెసా, యుజ్నీ, చోర్నోమోర్స్క్ నుంచి నల్ల సముద్రం మీదుగా రష్యా సేఫ్ కారిడార్ ఇచ్చింది. అంటే ఆ నౌకలపైన రష్యా దాడి చేయదు. ఆ ప్రాంతాల్లో కాల్పులు జరపదు. అయితే.. ఉక్రెయిన్ ఈ సాకుతో అక్రమంగా ఆయుధాలు తెప్పించుకోకూడదు అనే కండీషన్ పెట్టింది రష్యా. అందుకే కార్గో షిప్‌లు ఉక్రెయిన్‌కు రాకముందే రష్యన్, ఉక్రేనియన్, టర్కీ అధికారులు తనిఖీ చేస్తారు. ఐక్యరాజ్యసమితి డాటా ప్రకారం.. ఈ ఒప్పందం వల్ల ఆగస్టు 2022 నుండి ఉక్రెయిన్ ఓడరేవుల ద్వారా దాదాపు 33 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఎగుమతి అయ్యాయి. వాటిలో సగానికిపైగా ఎగుమతులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు జరిగాయి. యుద్ధం తర్వాత రికార్డు స్థాయికి చేరిన గోధుమ ధరలు ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత వరుసగా తగ్గాయి. అయితే.. కొన్ని కారణాల వల్ల పోయిన నెలలో రష్యా ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే టైంలో మన దేశం కూడా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో పేద దేశాల మీద ఆ ప్రభావం మరింత ఎక్కువగా పడనుంది.