పెద్దపల్లిలో పత్తాలేని ఫుడ్​ప్రాసెసింగ్​ యూనిట్​.. భూసేకరణ దగ్గరే ఆగిపోయిన పనులు

  •   భూసేకరణ  దగ్గరే ఆగిపోయిన  పనులు 
  •     500 ఎకరాల  అసైన్డ్​ ల్యాండ్​ను గుర్తించిన అధికారులు 
  •      లీడర్ల మధ్య పంచాయితీతో పనులు పెండింగ్​ ?

పెద్దపల్లి, వెలుగు:పెద్దపల్లి జిల్లాలో ఫుడ్​ ప్రాసెసింట్​ యూనిట్​  ఏర్పాటుకు  భూమిని గుర్తించినా.. పనులు మాత్రం ముందర పడటం లేదు.  500 ఎకరాల భూమిని సేకరించాలని 2022లో సర్కార్​ స్థానిక  అధికారులను ఆదేశించింది. సర్వే చేసిన అధికారులు పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం    1200 ఎకరాల అసైన్డ్​ ల్యాండ్​  ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  దాంట్లో నుంచి ఎలిగేడు మండలంలో  యూనిట్​ కోసం అనుకూలంగా ఉన్న భూమిని ఆఫీసర్లు ఫైనల్​ చేశారు.  అసైన్డ్​ ల్యాండ్​ను సాగు చేసుకుంటున్న  రైతులతో మాట్లాడి, పరిహారం అందించాలని  నిర్ణయించారు.  

సవాల్​గా భూసేకరణ  

పుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం భూసేకరణచేయడం సర్కార్​కు అప్పుడు సవాల్​ గా మారింది. ప్రభుత్వ భూములు లేకపోవడంతో అసైన్డ్​  ల్యాండ్స్​ కోసం అధికారులు సెర్చ్​ చేశారు. జిల్లాలో  ఎలిగేడు మండలంలో  భూములను అధికారులు గుర్తించారు. కానీ ఆ భూములన్నీ గత ప్రభుత్వాలు వివిధ సామాజికవర్గాలకు ఇచ్చింది.  ఇప్పుడు ఆ భూములన్నీ వివిధ అవసరాలకు, తోటల పెంపకానికి,  సాగుకు ఉపయోగిస్తున్నారు.  మండలంలోని వివిధ సర్వే నంబర్లలో గతంలో దాదాపు 1200 ఎకరాలు అసైన్డ్​ ల్యాండ్​ ఉందని  చెప్తున్నారు. 

పుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం అధికారులు సర్వే చేసి,  కావాల్సిన  భూములకు పరిహారం ఇచ్చి తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది.ఈ భూముల్లో ఎక్కువగా దళితులు, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. కొందరికి పాసు పుస్తకాలు జారీ కాగా మరికొందరికి ప్రొసీడింగ్స్​ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో  సాగు చేసుకుంటున్న భూములు ఇచ్చేది లేదని, భూములు సాగు చేసుకుంటున్నవారు చెప్పారు. అయినా అధికారులు సర్కార్​ నుంచి రైతులకు  అంగీకారమైన పరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో   సమస్య పరిష్కారమైంది.

రాజకీయ విభేదాల వల్లే జాప్యం!

ఎమ్మెల్యే  దాసరి మనోహర్​రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మధ్య 2014 నుంచీ రాజకీయ విబేధాలున్నాయి.  లీడర్ల వర్గపోరు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటకంగా మారింందనే విమర్శలు వస్తున్నాయి.  ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే  మధ్య  ఈ విభేదాల వల్లే  ఫుడ్ ప్రాసెసింగ్​  యూనిట్​ కూడా ముందు సాగడం లేదని  తెలుస్తోంది.  ఎలిగేడు మండలంలో యూనిట్​ ఏర్పాటైతే  క్రెడిట్​ తనకు రాదనే  ఎమ్మెల్యే దాసరి  ఆసక్తి చూపలేదని ఆరోపణలున్నాయి.

ఎదురు చూస్తున్న  స్థానికులు : 

జిల్లాకు ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ మంజూరు కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.  లాండ్​ ఆక్విజేషన్​ యాక్ట్​ ప్రకారం భూములకు పరిహారం దక్కుతుందని ఆశించారు.    స్థానికంగా  యువతకు ఉపాధి దొరుకడమే కాకుండా..  మండలం అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారు.  కానీ, రాజకీయ కారణాల వల్ల  నిర్మాణ పనులు చేపట్టాల్సిన అధికారులు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు.   ఏడాది గడుస్తున్నా  పనులు జరుగగపోడంతో జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  లీడర్లు స్పందించి ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ను పూర్తి చేయాలని కోరుతున్నారు.