- హైదరాబాద్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
- పోష్ నాష్ లాంజ్ & బార్, కిష్కింద రెస్టారెంట్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో కుళ్లిన కూరగాయలు, కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. జూబ్లీహిల్స్ లోని పోష్ నాష్ లాంజ్ అండ్ బార్, కిష్కింద కిచెన్ (కేక్ ది హట్టి) రెస్టారెంట్లలో శనివారం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తేలింది. కుళ్లిపోయిన కూరగాయలు, కిచెన్ లో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించడంతో పాటు హానికరమైన సిట్రిక్ యాసిడ్ ను ఫుడ్ లో వాడుతున్నట్లు గుర్తించారు. పోష్ నాష్ లాంజ్ అండ్ బార్ లైసెన్స్ గడువు 20.12.2024తో ముగిసిందన్నారు. అలాగే, ఒకకిలో సిట్రిక్ యాసిడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు సోయా సాస్ (1లీటర్ - సెప్టెంబర్ 2024), పాపడ్ ప్యాకెట్లు (18), రసం పొడి (1 కిలోలు - జూలై 2024), ఉల్లిపాయ పొడి (అక్టోబర్ 2024), కాజున్ మిక్స్ (డిసెంబర్ 2024), పుట్టగొడుగు (800 గ్రా), ప్యాక్ చేయబడిన మెంతి (2 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. అలాగే కిష్కింద కిచెన్ కేక్ ది హట్టిలో రిఫ్రిజిరేటర్లు ఆహార వ్యర్థాలతో నిండిపోయినట్లు, కిచెన్ లో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. రెండు రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.