- ల్యాబ్ టెస్ట్ ఫెయిలైన బిజినెస్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశం
న్యూఢిల్లీ: ల్యాబ్ టెస్ట్‌లో ఫెయిలైన ప్రొడక్ట్‌లను అమ్మొద్దని కొన్ని మసాలా బ్రాండ్లను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది. దేశం మొత్తం మీద వివిధ మసాలా బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్‌ల శాంపిల్స్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 22 న టెస్ట్ చేసింది. తాజాగా ఇంటర్నేషనల్ రెగ్యులేటర్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మసాలా బ్రాండ్లపై స్క్రూటినీ పెంచిన విషయం తెలిసిందే. ‘పాన్ ఇండియా టెస్టింగ్ డ్రైవ్‌లో భాగంగా సుమారు 4 వేలకు పైగా స్పైస్ శాంపిల్స్‌ను సేకరించాం. ఇందులో 2 వేల శాంపిల్స్ ల్యాబ్ రిపోర్ట్స్ అందుకున్నాం. సుమారు 100 శాంపిల్స్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు లేవు. పెస్టిసైడ్స్ వంటి అంశాల్లో ఫెయిల్ అయ్యాయి.
టెస్ట్‌లు ఫెయిలైన బిజినెస్‌లు ఈ బ్యాచ్ ప్రొడక్ట్‌లను అమ్మొద్దని ఆదేశించాం’ అని ఎఫ్‌ఎస్‌ఏఐ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని బిజినెస్‌లు సవాలు చేయొచ్చని, రీటెస్ట్‌ను కోరొచ్చని పేర్కొంది. ఎవరెస్ట్, ఎండీహెచ్ వంటి కొన్ని మసాలా బ్రాండ్ల ప్రొడక్ట్‌లలో లిమిట్‌కు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సేఫ్ కాదనుకునే ప్రొడక్ట్‌లను రీకాల్ చేయాలని వీరు ఆదేశించారు. కాగా, ఇథైలిన్ ఆక్సైడ్ లిమిట్ కంటే ఎక్కువ ఉండడంతో ఎవరెస్ట్, ఎండీహెచ్ బ్రాండ్లకు చెందిన కొన్ని ప్రొడక్ట్‌లను హాంకాంగ్, సింగపూర్ రెగ్యులేటర్స్ రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూ తర్వాత టెస్టింగ్ డ్రైవ్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చేపట్టింది.