Spoiled Onions: అమ్మకానికి కుళ్లిపోయిన ఉల్లిపాయలు.. బోడుప్పల్లో ప్రముఖ సూపర్ మార్కెట్ నిర్వాకం

Spoiled Onions: అమ్మకానికి కుళ్లిపోయిన ఉల్లిపాయలు.. బోడుప్పల్లో ప్రముఖ సూపర్ మార్కెట్ నిర్వాకం

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో కొన్ని వ్యాపార సంస్థలు చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రతను పూర్తిగా తుంగలో తొక్కి  నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తూ సొమ్మచేసుకుంటున్నాయి. ప్రముఖ సూపర్ మార్కెట్ రత్నదీప్ స్టోర్లో ఈ తరహా బాగోతం బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బోడుప్పల్ ఆకృతి టౌన్షిప్ సమీపంలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ నిర్వాకం వెలుగుచూసింది. ఈ రత్నదీప్ సూపర్ మార్కెట్ బ్రాంచ్ లో పాడైపోయిన ఉల్లిపాయలను అమ్మకానికి పెట్టారు. FSSAI License copy కనిపించలేదు. ఫుడ్ హ్యాండ్లర్స్కు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవు. ఈ సూపర్ మార్కెట్ బ్రాంచ్ అలసత్వంపై కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, తెలంగాణ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. రత్నదీప్ కు చెందిన ఈ బ్రాంచ్తో పాటు సికింద్రాబాద్లోని రాంపల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టిఫిన్ సెంటర్ సమీపంలోని బ్రాంచ్పై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఆ బ్రాంచ్లో కూడా పాడైపోయిన ఉల్లిపాయలను విక్రయిస్తున్నట్లు తేల్చారు.

 

రత్నదీప్ సంస్థకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో 150కి పైగా స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మొత్తం 60కి పైగా రత్నదీప్ స్టోర్స్ కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. రోజుకు కొన్ని వందల మంది కస్టమర్లు రత్నదీప్ స్టోర్స్ను విజిట్ చేస్తుంటారు. వేల ఉత్పత్తులను కొంటుంటారు. అలాంటి ప్రముఖ సూపర్ మార్కెట్ ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఇలా కుళ్లిపోయిన ఉల్లిపాయలను అమ్మకానికి పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బోడుప్పల్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ బ్రాంచ్ లో పాడైపోయిన ఉల్లిపాయలను అమ్ముతున్న విషయం కూడా ఫుడ్ సేఫ్టీ యాప్ లో ఒక వినియోగదారుడు (టికెట్ నంబర్.638257633) ఫిర్యాదు చేయడంతో బయటికొచ్చింది. రత్నదీప్ రెండు బ్రాంచులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోనున్నట్లు ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్లో స్పష్టం చేశారు.