కొంపదీసి కొండాపూర్ శరత్ సిటీ మాల్లోని చట్నీస్, అల్ఫాహార్ టిఫిన్స్లో తింటున్నారా..?

కొంపదీసి కొండాపూర్ శరత్ సిటీ మాల్లోని చట్నీస్, అల్ఫాహార్ టిఫిన్స్లో తింటున్నారా..?

హైదరాబాద్: కొండాపూర్ శరత్ సిటీ మాల్లో ఉన్న రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చట్నీస్, అల్పాహార్ టిఫిన్స్ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కిచెన్లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, పురుగులు పట్టిన గోధుమ పిండి, రవ్వ ఉపయోగిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు, క్యారట్లు వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. పేరుగాంచిన హోటళ్లలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఆహారం తిని ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నప్పటికీ యాజమాన్యాల తీరు మారడం లేదు.

అపరిశుభ్రమైన పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు, నిల్వ చేయడం వెజ్ పదార్థాలు, నాన్ వెజ్ ఒకే రిఫ్రిజిరేటర్లో నిలువ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. విపరీతమైన కాలుష్యం ఉండే రోడ్ల పక్కన దుమ్ము, ధూళి పడుతూ ఉంటే ఇడ్లీ, దోశ , జిలేబి, పానీపూరి లాంటి ఆహారాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ పాత్రలలో తయారీ, నిల్వ, ప్లాస్టిక్​ కవర్లలో నిల్వ, అపరిశుభ్ర నీటిని వినియోగించడం, కల్తీ పిండి, కల్తీ మసాలాలు, కల్తీ నూనెలు, నిల్వ ఆహారానికి రసాయనాలు కలిపి వేడి చేసి విక్రయించి ప్రజల ఆరోగ్యంతో కొందరు చెలగాటమాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ తీరు మార్చుకోవడం లేదు.

ప్రజలు ఎగబడి తినే కేఎఫ్‌సీ వాడిన ఆయిల్ను మళ్లీ తిరిగి వాడుతుందని 2024, ఏప్రిల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో తేలింది. అందులో కచ్చితమైన లాగ్లను కూడా మెయిన్ టేన్ చేయడం లేదని ఫుడ్ సేఫ్టీ డిఫార్ట్‌మెంట్ అప్పట్లో తెలిపింది. స్టార్‌బక్స్, హార్డ్ రాక్ కేఫ్లు కూడా FSSAI రూల్స్ బ్రేక్ చేశాయని అధికారులు వెల్లడించారు. శుభ్రతా, నాణ్యత విషయాల్లో FSSAI రూల్స్ పాటించని హోటల్స్, రెస్టారెంట్లకు నోటీసులు పంపారు.