Alert: శవర్మ తింటున్నారా... ఇది గుర్తుంచుకోండి..

ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్ట్రీట్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా   పానీపూరి, శవర్మ వంటి స్ట్రీట్ ఫుడ్ కోసం జనం ఎక్కువగా ఎగబడుతుంటారు. అయితే.. శుచి, శుభ్రతలేని స్ట్రీట్ ఫుడ్ తిని జనం ఆసుపత్రిపాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మోమోస్ తిని మహిళ మృతి చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన కలకలం రేపింది.. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు స్ట్రీట్ ఫుడ్ పట్ల ప్రజలు అప్రంమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

బంజారాహిల్స్ మోమోస్ ఘటనలో బాధితుల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... స్ట్రీట్ ఫుడ్ విషయంలో కీలక సూచనలు చేశారు. ఈ మధ్య మయోనీస్, శవర్మ, పానీ పురి తినేవారికి ఫుడ్ పాయిజన్ అవుతుందని.. మయోనీస్, శవర్మలు తయారు చేసిన వెంటనే తినాలని అన్నారు. 3 గంటలు లేట్ చేసి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశమున్న స్ట్రీట్ ఫుడ్ మానేస్తే మంచిదని అన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు.

స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని.. దీపావళి కి ఎక్కువ మొత్తం లో స్వీట్స్ తయారు చేస్తారు.. కాబట్టి స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించే స్వీట్ షాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా లైసెన్స్ తీసుకోవాలని.. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ రిజిస్ట్రేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. 3 వేల మందికి లైసెన్స్ లు ఇచ్చామని అన్నారు.