హాస్టళ్లలో ఫుడ్​ సేఫ్టీయేనా?.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పర్మిషన్లు లేకుండానే హాస్టళ్ల నిర్వహణ!

హాస్టళ్లలో ఫుడ్​ సేఫ్టీయేనా?.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పర్మిషన్లు లేకుండానే హాస్టళ్ల నిర్వహణ!
  •     తనిఖీలు చేయని ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు
  •     హోటళ్లు, రెస్టారెంట్లలోనూ నామమాత్రం సోదాలే

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు రెస్టారెంట్లు, హోటళ్లలోనే నామమాత్రం  తనిఖీలు చేస్తూ ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లోని హాస్టళ్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా ప్రైవేట్ విద్యాసంస్థల్లో హాస్టళ్లను ఏళ్ల తరబడి ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నడిపిస్తున్నా.. వాటి వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. 

హైస్కూళ్ల దగ్గర నుంచి, ఇంటర్​ కాలేజీల్లో కూడా హాస్టళ్లను నడిపిస్తున్నారు. కేవలం డే స్కాలర్లకు చదువులు చెప్పేలా మాత్రమే పర్మిషన్లు తీసుకొని, వాటినే రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లా నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థులకు మాత్రం క్వాలిటీ లేని ఫుడ్​ పెడుతున్నారనే విమర్శలున్నాయి. 

లైసెన్స్​ ఉండాల్సిందే..

రోజూ స్కూల్​ లేదా కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల చదువుల గురించి పట్టించుకునేందుకు సమయం లేక కొందరు, ఊరి నుంచి బస్సుల్లో పిల్లలను పంపించలేక మరికొందరు హాస్టళ్లలో జాయిన్​ చేస్తున్నారు. ఆహారాన్ని ఫ్రీగా పంపిణీ చేయకుండా హోటళ్లు, రెస్టారెంట్లలా వ్యాపారంగా నిర్వహించే ప్రతి ఒక్కరికీ లైసెన్స్​ ఉండాల్సిందేనని, రూల్స్​ పాటించాల్సిందేనని ఆఫీసర్లు చెబుతున్నారు. 

  •     వంటలు చేసే హాల్ లేదా గదికి ప్రతి ఆర్నెళ్లకోసారి తెల్ల రంగు వేయించాలి. 
  •     క్యాంటీన్లలో ఎక్కడా నీరు నిల్వకుండా ఫ్లోరింగ్ పరిశుభ్రంగా ఉంచాలి. 
  •     వంటశాలలో పనిచేసే వారికి నెత్తికి సరైన క్యాప్​, చేతులకు గ్లౌజులు, నోటికి మాస్క్​ లు ఉండాలి. 
  •     ప్రతి ఆర్నెళ్లకోసారి సిబ్బందికి ఫిట్ నెస్​ టెస్టులు నిర్వహించాలి. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి.

 
కానీ, ఇవేవీ అమలు కావడం లేదు. ఇటీవల ఉన్నతాధికారులు వచ్చి రెండ్రోజుల పాటు పేరొందిన రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేసిన సమయంలో వాటిలో చాలా నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. కుల్లిపోయిన చికెన్​ వింగ్స్​, ఎక్స్​ పైరీ డేట్ దాటిపోయిన జీలకర్ర, పసుపు, ఫ్రిజ్ లో నిల్వ చేసిన తందూరి కబాబ్​ లు, ఇలా చాలా తప్పులు వెలుగులోకి వచ్చాయి. అప్పుడప్పుడు సోదాలు చేస్తుంటేనే ఈ పరిస్థితి ఉంటే, ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా తనిఖీలు చేయని ప్రైవేట్ హాస్టళ్లు, ఆస్పత్రుల్లోని క్యాంటీన్లలో పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానాలు కలుగుతున్నాయి. 

సిబ్బందిని పెంచలే.. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో ఖమ్మం జిల్లా స్థాయిని గెజిటెడ్​ ఫుడ్​ ఇన్​ స్పెక్టర్​ స్థాయి నుంచి అసిస్టెంట్​ ఫుడ్​ కంట్రోలర్​ స్థాయికి పెంచారు.. కానీ ఆ మేరకు అధికారులు, సిబ్బందిని పెంచలేదు. జిల్లాలో అసిస్టెంట్ ఫుడ్​ కంట్రోలర్, గెజిటెడ్​ ఫుడ్​ఇన్​ స్పెక్టర్​ , ఇన్​ స్పెక్టర్​, ముగ్గురు అటెండర్లు ఉండాలి. కానీ ఒక గెజిటెడ్​ ఫుడ్​ ఇన్​ స్పెక్టర్​ ​, మరో టైపిస్ట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో తోపుడు బండ్ల దగ్గర నుంచి, కర్రీపాయింట్లు, బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో తనిఖీలకే ఉన్న సిబ్బందికి సమయం సరిపోవడం లేదు. ఇక ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఈ సిబ్బందితోనే సోదాలు చేయించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల హాస్టళ్లను తనిఖీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

పర్మిషన్లు తీసుకోలే..

ఖమ్మం జిల్లాలో ఒక్క విద్యాసంస్థలో కూడా హాస్టళ్ల నిర్వహణకు ఎలాంటి లైసెన్స్​ తీసుకోలేదు. ఇటీవల 15 గవర్నమెంట్ రెసిడెన్షియల్​ హాస్టళ్లలో తనిఖీలు చేశాం. కూరగాయలు, వంటశాలలకు సంబంధించి వారికి పలు సూచనలు చేశాం. త్వరలోనే ప్రైవేట్ విద్యాసంస్థల్లోని క్యాంటీన్లలోనూ తనిఖీలు నిర్వహిస్తాం. ఆహార పదార్థాల కోసం డబ్బులు తీసుకుంటూ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఫుడ్​ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ​లేకపోతే చర్యలు తప్పవు 
- రాయపూడి కిరణ్​, 
ఖమ్మం జిల్లా ఫుడ్​ సేఫ్టీ అధికారి