యాదాద్రి, వెలుగు : ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు యాదాద్రి జిల్లాలోని హోటల్ వివేరాపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ఫైరీ డేట్ లేని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. హోటల్వివేరాలో ఇటీవల ఓ వినియోగదారుడు బిర్యానీకి ఆర్డర్ చేసి తింటుండగా, దాంట్లో జెర్రీ వచ్చింది. దీంతో సదరు వినియోగదారుడు హోటల్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.
దీంతోపాటు బిర్యానీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా ఫుడ్‌సేఫ్టీ కమిషనర్వద్దకు చేరింది. హోటల్వివేరాలో తనిఖీ చేయాలని యాదాద్రి ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సుమన్ కల్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హోటల్వివేరాపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.
కిచెన్‌లో మూతలు లేని బకెట్లలో చట్నీలను నిల్వ చేయడాన్ని గమనించారు. తయారీ, ఎక్స్ ఫైరీ తేదీ లేకుండా కొన్ని వస్తువులు, కూల్ డ్రింక్స్ ఉండడంతో వాటిని పరిశీలించి ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావారణంలో కిచెన్ ఉండడం, అక్కడే వంట కోసం నిల్వ చేసిన చికెన్ ముక్కలను పరిశీలించారు. అనంతరం హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.