- ప్రమాదకరమైన కలర్స్ వాడకంపై నోటీసులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, ఇందిరాపార్కు సమీపంలోని ఎమరాల్డ్స్ స్వీట్ హౌస్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. న్యాచురల్ ఆహార పదార్థాల అమ్మకాలు జరుగుతాయని ప్రచారం జరగడంతో లక్షలాది మంది కస్టమర్లు ఇక్కడి నుంచి తినుబండారాలను రోజూ తీసుకెళ్తున్నారు. అయితే, జీహెచ్ఎంసీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఇదంతా బోగస్ అని తేలింది.
ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వీట్లను తయారుచేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు, మెడికల్ సర్టిఫికెట్లు లేని ఫుడ్ హ్యాండిలర్స్, సరైన లేబ్లింగ్ లేని వాటర్ క్యాన్స్, ముడి సరుకులను గుర్తించారు. కలర్స్ మిక్స్ చేసి ఉంచిన 60 కేజీల బెల్లం, సరిగా లేని మూడు కిలోల జీడి పప్పుని అధికారులు సీజ్ చేశారు.
తనిఖీలు చేసిన తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి తరలించారు. సదరు స్వీట్ హౌస్ మేనేజ్మెంట్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాము సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామని, అధికారుల తనిఖీలకు అడ్డుపడటం లేదని ఎమరాల్డ్స్ స్వీట్ షాప్ నిర్వాహకులు పేర్కొన్నారు.