- అపరిశుభ్రంగా రెస్టారెంట్లలోని కిచెన్లు
- కొనసాగిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. సంతోశ్‌నగర్ శ్రీరాఘవేంద్ర, ఉడిపి, స్వీకర్ హోటల్స్ కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు, కుల్లిన ఉల్లిగడ్డలు, ఫంగస్పట్టిన అల్లంతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. చెఫ్‌లు క్యాప్స్, గ్లౌజులు, ఆప్రాన్ ధరించకపోవడం చూసి యజమానులపై మండిపడ్డారు. స్వీకర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ప్రదర్శించలేదని, కిచెన్ ఫ్లోర్ క్లిన్గా లేదని గుర్తించారు.
గడువు ముగిసిన 3 ప్యాకెట్ల మలబార్ పరోటాలను, ఆలుగడ్డ, ఉల్లిగడ్డలను నేలపై నిల్వ చేసినట్లు, స్వాతి హోటల్ లో ఫుడ్ లైసెన్స్ ప్రదర్శించకపోవడంతో పాటు ఫుడ్ హ్యాండ్లర్లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేనట్లు తెలుసుకున్నారు. లైసెన్సు కాపీలో హోటల్ స్వాగత్ అని ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ క్లీన్‌గా లేకపోవడం, పురుగులు, బొద్దింకలు తిరుగుతుండడం చూసి మండిపడ్డారు.
ఫుడ్ఐటమ్స్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలిసింది. నాగోలు లక్కీ రెస్టారెంట్ లో పాడైన బ్రకోలి, క్యాబేజీని గుర్తించారు. ఎల్బీనగర్ మధురం, ఉప్పల్ సురభి రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఆయా రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు.