న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి తిండి తిన్నామా.. హైద్రాబాద్ రెస్టారెంట్లలో అధ్వాన్న పరిస్థితులు

న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి తిండి తిన్నామా.. హైద్రాబాద్ రెస్టారెంట్లలో అధ్వాన్న పరిస్థితులు

అసలే న్యూ ఇయర్.. హోటల్స్ కు ఫుల్ డిమాండ్.. బిర్యానీలకు ఫుల్ ఆర్డర్స్.. ఎంత కమాయించుకుంటే అంత.. ఏది పెట్టినా తింటారులే అనుకున్నారేమో. స్వచ్ఛత, పరిశుభ్రత పాటించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నా.. హోటల్స్ నిర్వాహుకుల తీరు మారటం లేదు. 

న్యూ ఇయర్ సందర్భంగా హైద్రాబాద్ కొంపల్లిలోని హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొంపల్లిలోని ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో వరుస దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రమైన కిచెన్ పరిసరాలను చూసి అధికారులు షాకయ్యారు. 

 నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు. అదేవిధంగా కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

వంట గదులు పూర్తి అపరిభ్రంగా ఉన్నాయని.. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాలం చెల్లిన వంట సామాగ్రి వాడుతున్నట్లు గుర్తించారు. అదే విధంగా వెజ్, నాన్ వెజ్ ఒకే ఫ్రిజ్లో స్టోర్ చేసి వాడుతున్నట్లు బయటపడింది. 

వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కు బటర్ అప్లై చేయడానికి రెస్టారెంట్లలో పెయింటింగ్ బ్రష్ వాడుతున్నట్లు కనిపెట్టారు. తుప్పు పట్టిన పాత ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలు నిలువ ఉంచినట్లు గుర్తించిన అధికారులు హోటల్స్ కు నోటీసులు అందించారు.