- రాజేంద్రనగర్ మెస్సర్స్ స్కై ఫుడ్ యాజమాన్యానికి నోటీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కల్తీకి ఏదీ అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. పిల్లల తినే చాక్లెట్లను సైతం దుమ్ముధూళిలో నాసిరకం పదార్థాలతో తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రొడక్ట్స్‌ను షాప్స్‌కు సప్లై చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఇది బట్టబయలైంది. రాజేంద్రనగర్ లోని ‘మెస్సర్స్ స్కై ఫుడ్ ప్రొడక్ట్స్’ లో శుక్రవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
చాకెట్లను అపరిశుభ్రం వాతావరణంలో తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఫైరయ్యారు. చాక్లెట్ల తయారీ కోసం ఉంచిన 950 కిలోల నాసిరకం కోకో పౌడర్, 75 కిలోల కలర్ షుగర్ కోటెడ్ సోంపు, ఇతర పదార్థాలను సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనంతరం యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.