- నిల్వ చేసిన చికెన్, మటన్ తో వంటకాలు
- ఐదు రోజులకోసారి గ్రేవీ ప్రిపేర్
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో విస్తుబోయే విషయాలు
- 2017 నుంచి నగర పాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్ పోస్టు ఖాళీ
- క్వాలిటీ చెక్ లేకుండా ఆహార పదార్థాల అమ్మకాలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని హోటళ్లలో పరిశుభ్రత పాటించకుండానే కస్టమర్లకు రోజుల తరబడి నిల్వ చేసిన ఆహారాన్ని పెడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండగా.. కుళ్లిన మసాలాలు, రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్, మటన్ ను కస్టమర్లకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి పాడుకాకుండా ఉండడానికి నాసిరకం మసాలా ఫేస్టులు, ఫుడ్ కలర్లు వాడుతున్నారు. దీంతో రుచికరంగా ఉందని తింటున్న జనాలు వాంతులు విరేచనాలతో మంచాన పడుతున్నారు. గత పది రోజల్లో ఇన్ చార్జ్ ఎం హెచ్ వో సాజిద్ అలీ, ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ తారాసింగ్ నాయక్ నిర్వహిస్తున్న రైడ్స్ లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి.
కేవలం బిజినెస్ దృష్టే
ఇందూర్ నగరంలో చిన్నాపెద్ద హోటళ్లు సుమారు వంద ఉండగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాలు మండల కేంద్రాలు కలిపితే 300 దాకా హోటల్స్ ఉంటాయి. ఒకప్పుడు మెట్రో సిటీలకు పరిమితమైన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు విలేజ్లదాకా విస్తరించింది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు కూడా లెక్కలేనన్నీ పుట్టుకొస్తున్నాయి. రోజుకు కర్రీ పాయింట్ బిజినెస్ రూ. 15 వేలు, హోటల్స్, రెస్టారెంట్ల అమ్మకాలు రూ. 30 వేలు నుంచి రూ. లక్ష దాకా ఉండగా.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కౌంటర్ రూ. 25 వేలకు తక్కువగా ఉండడం లేదు. అయినా వీటి ఓనర్లు కుళ్లిపోయిన ఆహారాన్ని, నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కంప్లైంట్స్‌తో కదిలి..
హోటల్స్ లో క్వాలిటీ భోజనం సప్లై చేయడం లేదని ప్రజలు ఫిర్యాదు చేయగా.. ఫుడ్‌సెఫ్టీ శాఖ ఆఫీసర్ తారాసింగ్ నాయక్ తనిఖీలు చేపట్టారు. గురువారం సిటీలోని వినాయక్‌నగర్ ఏరియాలో గల ఓ పేరున్న హోటల్‌పై ఆయన సిబ్బందితో కలిసి రైడ్ చేయగా కుళ్లిన చికెన్, రోజుల తరబడి నిల్వ పెట్టిన మటన్‌తో కూరలు వండుతున్నట్లు తేలింది. ఐదు రోజులకోసారి గ్రేవీ ప్రిపేర్ చేసి వెచ్చబెట్టి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు.
కుళ్లిన మసాలా పేస్ట్ పడేయక తాజా పేస్ట్‌లో మిక్స్ చేసి వంటలకు వాడుతున్నట్లు గ్రహించారు. ఫాస్ట్ ఫుడ్ తనిఖీ చేయగా ఊరుపేరులేని నూడుల్స్, వారంపాటు నిల్వ ఉన్న చికెన్ లెగ్‌పీస్‌లు, కుళ్లిన కోడిగుడ్లను, హెల్త్‌ను ఎఫెక్ట్ చేసే కలర్స్ వాడుతున్నట్లు తేలింది. వాటన్నింటినీ బయట డ్రైనేజీలో పడేసి వార్నింగ్ ఇచ్చారు. గత వారం మరో ప్రముఖ హోటల్‌పై రైడ్ చేయగా అక్కడా ఇట్లనే ఉన్న చికెన్, మటన్ కర్రీస్, మసాలాలు, కలర్స్ పారబోసి వార్నింగ్‌తో సరిపెట్టారు. గత వారం మున్సిపల్ ఇన్ఛార్జ్ హెల్త్ ఆఫీసర్సాజిద్అలీ 13 మంది హోటల్ నిర్వాహకులకు రూ.13 వేల ఫెనాల్టీ వేసి పద్ధతి మార్చాలని అల్టిమేటం ఇచ్చారు.
ఎనిమిదేండ్ల నుంచి ఎంహెచ్వో కుర్చీ ఖాళీ
నగరపాలక సంస్థలో ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉన్న డాక్టర్‌ను హెల్త్ ఆఫీసర్‌గా నియమించాలి. 2017లో డాక్టర్ సిరాజుద్దీన్ రిటైర్మెంట్ తర్వాత మూడు నెలలు నిర్మల్‌కు చెందిన శ్రీనివాస్‌ను ఎంహెచ్‌వోగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్అలీని ఇన్ఛార్జ్ ఎంహెచ్‌వోగా కొనసాగిస్తున్నారు.