ప్రైవేట్ హాస్టల్స్​లో కుళ్లిన కూరగాయలు

ప్రైవేట్ హాస్టల్స్​లో కుళ్లిన కూరగాయలు
  • ఫుడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే చర్యలు

హైదరాబాద్, వెలుగు: ఫుడ్ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేట్ హాస్టల్స్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజుల్లో 15 హాస్టల్స్​పై దాడులు నిర్వహించారు. ప్రతీ హాస్టల్​లో ఏదో ఒక సమస్య ఉన్నట్టు గుర్తించారు. కిచెన్ నుంచి దుర్వాసన వస్తుండటంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఆరు హాస్టల్స్​లో అధికారులు తనిఖీ చేశారు. 

ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రమాణాలు పాటించలేదని అధికారులు తెలిపారు. మమతా ఉమెన్స్ హాస్టల్.. లైసెన్స్ లేకుండానే కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కిచెన్, ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తున్నదన్నారు. డ్రింకింగ్ వాటర్ పీహెచ్ 8.45 వచ్చిందని తెలిపారు. తిరుమల మెన్స్ హాస్టల్​లో కిచెన్ క్లీన్​గా లేదన్నారు. 7 మెన్స్ పీజీ హాస్టల్స్​లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఫుడ్ లైసెన్సులు లేకుండానే హాస్టల్స్ నడిపిస్తున్నారని చెప్పారు. 

హరి హెవెన్ లగ్జరీ హాస్టల్​లోనూ కిచెన్​లో దుర్వాసనతో పాటు ఎక్స్​పైర్ ఐన ఆహార పదార్థాలు లభ్యమైనట్టు తెలిపారు. అలాగే, కుళ్లిపోయిన కూరగాయలు గుర్తించామన్నారు. శ్రీలక్ష్మి మెన్స్ హాస్టల్​కు ఫుడ్ లైసెన్స్ లేదన్నారు. కిచెన్ క్లీన్​గా లేదని, ఫుడ్ ప్రమాణాలు పాటించట్లేదని చెప్పారు. ఆర్​3 కోలివ్​లో కలర్లు, గ్రీన్ చిల్లిసాస్, టమాట సాస్​లో నాణ్యత లేదని తెలిపారు. హాస్టల్ నిర్వాహకులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపించామన్నారు. క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయకపోతే 040–21111111కి కాల్ చేయాలన్నారు.