
- హోటల్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
- తరుచుగా హోటళ్లు, సూపర్ మార్కెట్లలో కల్తీ ఫుడ్ ఘటనలు
జనగామ, వెలుగు: జనగామ పట్టణంలోని హోటళ్లలో కల్తీఫుడ్, సూపర్ మార్కెట్ లో ఎక్స్ ఫైరీ ఐటంల అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంలో హోటళ్లు, సూపర్ మార్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. అడిగేవారు లేక ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా హోటళ్లు ఉండగా ఎక్కువ మొత్తం వాటిలో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. టేస్ట్ కోసం హానికర కలర్స్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో కుళ్లిన పదార్థాలను సైతం వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల పట్టింపులేని తీరు విమర్శలకు తావిస్తోంది.
- ఈ నెల 20న జనగామ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్‌లోని క్యూటీక్యూ హోటల్లో ఓ యువకుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. బాధితుడికి చికెన్‌లో బొద్దింక కనిపించింది. భోజనంలో బొద్దింక రావడం ఏమిటని నిర్వాహకులను ప్రశ్నించాడు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆఫీసర్లు హోటల్ సీజ్ చేసి రూ.10 వేల జరిమానా విధించారు. మరుసటి రోజు నుంచే సదరు హోటల్ కార్యకలాపాలు యధావిధిగా సాగుతుండడంతో పలువురు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
- గత నెల ఫిబ్రవరి 24న జనగామలోని నెహ్రూ పార్క్ రోడ్లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్లో కొన్న డ్రై ఫ్రూట్ నట్స్ప్యాకెట్లో పురుగులు వచ్చాయని బాధితుడు నేతి ఉపేందర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు తనిఖీలు చేపట్టి సూపర్ మార్కెట్‌ను సీజ్ చేసి రూ 20 వేల జరిమానా విధించారు. కాగా తాజాగా ఇలాంటి సంఘటనే ఇదే మార్కెట్ లో చోటు చేసుకోగా.. మళ్లీ అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.
- ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు వచ్చి మొక్కుబడి తనిఖీలు చేసి ఎంతో కొంత ఫైన్ వేసి వదిలేస్తున్నారు. సదరు నిర్వాహకులు మరుసటి రోజు నుంచే ఎప్పటిలాగే కల్తీ ఫుడ్ దందాను కొనసాగిస్తున్నారు. హోటల్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నాణ్యత మరిచి
నాణ్యత పాటించాల్సిన నిర్వాహకులు ధనార్జనకు తెగబడ్డారు. పలువురు నిర్వాహకులు కుళ్లిన మాంసం, ఫ్రిడ్జిల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను వాడుతున్నారు. కిచెన్‌లో, భోజనాలు వడ్డించే స్టాఫ్ కనీస పరిశుభ్రత పాటించడం లేదు. జనగామకు రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు. ఇంచార్జ్ గా ఉన్న కృష్ణ మూర్తి ఎప్పుడు వస్తారో ఎక్కడ తనిఖీలు చేస్తారో అంతా గోప్యంగానే ఉంటోంది.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఆహారభద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వచ్చి హడావుడి చేస్తున్నారు. రెండు నెలల క్రితం హైదరాబాద్ రోడ్‌లోని బిర్యానీ హోటల్లో హానికర కలర్స్ వాడుతున్నారని, కుళ్లిన మాంసం ఉపయోగిస్తున్నారని కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.