కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మైత్రి హోటల్, మిఠాయివాలా స్వీట్ షాపుల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం గురువారం సాయంత్రం దాడులు నిర్వహించింది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ రెడ్డి, పి.స్వాతి, శీర్షికతో కూడిన బృందం మైత్రి హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా ఫ్రిజ్ లో నిబంధనల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తుల నిల్వ, హానికరమైన రంగులను కలిపిన చికెన్ డ్రమ్ స్టిక్స్, తుప్పు పట్టిన వంట పాత్రలు, బూజు పట్టిన కూరగాయలను గుర్తించారు.
దీంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.25వేల విలువైన 20 కిలో మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేశారు. అలాగే మిఠాయివాలా స్వీట్ షాప్ లో స్వీట్స్, కేక్స్ తయారీలో మోతాదుకు మించి హానికరమైన రంగులను, గడువుతీరిన ముడి సరుకులను, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పైరీ డేట్ లేని బ్రెడ్ ప్యాకెట్స్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.7వేల విలువైన ఆహార పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేస్తున్న మేనేజ్ మెంట్‌కు నోటీసులు జారీ చేశారు.