పెద్ద రైతుల వల్లే దేశానికి ఆహారభద్రత

‘‘వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు ఎందుకు?” అంటూ శ్రీనివాస్​ తిపిరిశెట్టి ‘వెలుగు’లో ఒక ఆర్టికల్​ రాశారు. ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా ఉంది. ఇప్పటికే దీనిపై ఎన్నోసార్లు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ దానికి జవాబు కూడా ఇచ్చారు. నేను 2000లో ‘ఆంధ్రప్రదేశ్​ అగ్రికల్చర్: సినారియో ఆఫ్​ ద ఫోర్​ డికేడ్స్’ అనే పుస్తకంలో వ్యవసాయంలోని మంచి చెడుల గురించి విశ్లేషించాను. గణాంకాలతో కూడిన విశ్లేషణ అది. తర్వాత కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం కొన్ని పథకాలు ​అమలు చేశాయి. ఉచిత విద్యుత్, ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకే ఇవ్వడం లాంటివి చేశాయి. 

ప్రతి దాంట్లో బ్లాక్​ మార్కెట్​ పెరిగింది
బీదల కొరకు పెట్టిన ఉచిత బియ్యం(పీడీఎస్) బ్లాక్​ మార్కెట్​కు చేరి రైతులను దెబ్బతీస్తున్నది. అలాగే రసాయన ఎరువులు బ్లాక్​ మార్కెట్​కు చేరడం సర్వసాధారణం అయిపోయింది. ఈ బ్లాక్​ మార్కెట్​ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి కంప్లయింట్​ చేయడం, వీటిపై సబ్సిడీని లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చట్టం తీసుకురావడం, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైనే లబ్ధి చేకూరింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కువగా పట్టి పీడిస్తున్నది కల్తీ విత్తనాల వ్యవస్థ. దీనిపైనా 2000 నాటి పుస్తకంలో నేను చర్చించాను. అలాగే పంట మార్పిడిని అమలు చేయడం. కానీ, దీనిపై జరిగిందేమీ లేదు. రైతులు నష్టపోవడం తప్ప. ఇలాంటి వాటిలో రైతుబంధు సముద్రంలో నీటి బిందువు లాంటిదే. ఇక్కడ కొన్ని విషయాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వేలు, లక్షల కోట్ల రూపాయలను వ్యాపారులకు వడ్డీ తగ్గించి అప్పులు ఇస్తున్నది. బయటి నుంచి పెట్టుబడులకు దారులు సుగమం చేస్తున్నది. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ మహాశయుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లను ఒక కులానికి కల్పిస్తే, 70 సంవత్సరాలు గడిచేనాటికి ఇది ఎన్నో కులాలకు, మతాలకు చేరి 50 శాతానికి వచ్చింది. అయినా ఇంకా ఇది ఆగడం లేదు. ఇక్కడ ధనికులకు, బీదలకు తేడా లేదు. అంతే కాదు బయట ఉన్న 50 శాతం వారికి, వీరికి కూడా తేడా లేదు. 

భూములను ఆక్రమించడంతోనే వరదలు
పట్టణ ప్రాంతాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించి వందలు, వేల కోట్లు ఆర్జించుకుంటూ పోతున్నారు. దీనితో వరదలు వచ్చి అందరికీ నష్టం కలుగుతోంది. వర్షాకాలం రాగానే, వరదలను ఎలా అరికట్టాలనే దానిపై చర్చలు, డబ్బును నీటిపాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మనం మరిచిపోలేని అతి ముఖ్యమైన విషయం, శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ చుట్టుపక్కల భూములను రైతుల నుంచి వందల కోట్లలో కొని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. దీనిలోభాగంగా తాగునీటి చెరువులను, పర్యావరణాన్ని నాశనం చేశారు. ఈ పరిణామాలతో కొత్త ప్రాంతాలకు కూడా వరదల ముప్పు ఏర్పడింది. 

ఆఖరిగా చెప్పేదేమిటంటే.. పైన చెప్పిన అన్ని విషయాల వల్ల రైతుకు ఖర్చు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల పెద్ద రైతులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. దేశానికి ఆహార భద్రత కల్పించడంలో పెద్ద రైతుల పాత్రే కీలకం. అలాగే ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం అందించేంది కూడా వీరే. అలాంటి పెద్ద రైతులు పంటలు పండించలేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. అందువల్ల ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు, ఐదు ఎకరాలకంటే తక్కువ ఉన్న రైతులు అనే వ్యత్యాసం అవసరం లేదు. అందరినీ సమానంగానే చూడాలి. 

పెద్ద రైతులే ఎక్కువ నష్టపోతున్నరు
మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకునిపోయే దిశలో.. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల కోసం ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పిస్తూ వస్తున్నది. దీనిలో భాగంగా భారీ నీటి వనరుల ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి వసతి లేని దగ్గర ఉచిత విద్యుత్​ ఇవ్వాలని ఎన్నో ఆర్టికల్స్ నేను రాశాను. 2004 దీనికి పునాది పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందించే దిశగా అతి భారీగా విద్యుత్​ వినియోగం చేస్తున్నది. వీటన్నింటి లబ్ధిదారులు చిన్న, పెద్ద రైతులు. ఇందులో ఇద్దరూ సమానమే. అంతే కాదు వ్యవసాయాన్ని భారీగా దెబ్బతీసేది వాతావరణం. దీనికి ఉన్నవాడు, లేనివాడు అనే తేడాలు లేవు. కానీ పెద్ద రైతులే ఎక్కువ నష్టపోతున్నారనేది నగ్న సత్యం. 

- డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్​ ఫౌండర్​ మెంబర్