
హైదరాబాద్, వెలుగు: కేటరింగ్ సర్వీస్‌లను అందించే ఫుడ్‌లింక్ గ్రూప్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఇరవై ఏళ్ల కిందట ముంబైలో ప్రారంభమైన ఈ కంపెనీ, తర్వాత అహ్మదాబాద్, ఛండీగడ్, ఢిల్లీలలో తన సేవలను విస్తరించింది. లగ్జరీ సెగ్మెంట్‌లో బిజినెస్ చేస్తున్న ఫుడ్‌లింక్ అంటాలా (టర్కీ), దుబాయ్ (యూఏఈ), మిలాన్ (ఇటలీ) లో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంబానీ–పిరమల్, దీపిక–రణ్‌వీర్ వంటి ప్రముఖుల వెడ్డింగ్‌లకు కేటరింగ్ సర్వీస్‌లను అందించామని ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సంజయ్ వజిరాని అన్నారు.
పెద్ద పెద్ద ఈవెంట్లకు, పెళ్లిళ్లకు హైదరాబాద్ వేడుకగా ఉందని, అందుకే ఈ సిటీలో విస్తరించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సిటీలో రెస్టారెంట్లను, బ్యాంక్వెట్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రొఫెషనల్ కేటరింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ సైజ్ రూ.20 వేల కోట్లని సంజయ్ పేర్కొన్నారు. ఏడాదికి 25 నుంచి 30 శాతం వృద్ధి చెందుతుందని అంచనావేశారు. హైదరాబాద్‌లో ఏడాదికి సుమారు 2,000 నుంచి 2,500 వరకు పెద్ద వెడ్డింగ్స్ జరుగుతున్నాయని, వీటి సగటు ఖర్చు రూ. 5 కోట్ల వరకు ఉంటోందని అన్నారు.
ALSO READ :24 గంటల్లో 31 డెలివరీలు.. జనగామ ఎంసీహెచ్ రికార్డు
వెడ్డింగ్ మార్కెట్ రూ.12,000 కోట్లుగా ఉందని అంచనావేశారు. ఫుడ్‌లింక్స్ హైదరాబాద్‌లో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో 6 వేల చదరపు అడుగుల్లో వేర్‌హౌస్, 9 వేల చదరపు అడుగుల్లో కిచెన్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల రెవెన్యూ సాధిస్తామని, ఇంకో నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల మార్క్‌ను దాటడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని సంజయ్ పేర్కొన్నారు. ఇంకో మూడేళ్లలో ఐపీఓకి వెళతామని కూడా చెప్పారు.