
- ఇండియా, కువైట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ డ్రా
కోల్‌కతా : ఇండియా ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి కెరీర్ ఫేర్‌వెల్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్–ఎలో గురువారం ఇండియా, కువైట్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ 0–0తో డ్రా అయ్యింది. ఇది ఛెత్రి రిటైర్మెంట్ మ్యాచ్ కావడంతో అదిరిపోయే వీడ్కోలు ఇవ్వాలని భావించిన సహచరులు ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడారు. కానీ కువైట్ డిఫెన్స్ బలంగా ఉండటంతో గోల్ కొట్టే అవకాశాలు చేజారాయి. స్ట్రయికర్ అన్వర్ అలీ మెరుపు వేగంతో సర్కిల్‌లోకి దూసుకుపోయినా సక్సెస్ కాలేదు.
తొలి హాఫ్ మొత్తం కువైట్ డిఫెన్స్‌కు ఇండియా ఫార్వర్డ్స్‌కు భీకరమైన పోరాటం జరిగింది. అయితే రెండో హాఫ్‌లో కువైట్ ఎరుదుదాడికి దిగింది. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజా ఫలితంతో ఇండియా వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశాలు మరింత క్లిష్టతరమయ్యాయి. ఈ గ్రూప్‌లో ఇండియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు మాత్రమే సాధించి రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ నెల 11న జరిగే చివరి మ్యాచ్‌లో ఇండియా.. ఆసియా చాంపియన్ ఖతార్‌తో తలపడనుంది. అదే రోజు కువైట్.. అఫ్గానిస్తాన్‌ను ఎదుర్కొనుంది. ఇందులో ఫలితాన్ని బట్టి ఇండియా వరల్డ్ కప్ క్వాలిఫై చాన్సెస్ ఆధారపడి ఉంటాయి.
ఛెత్రి అల్విదా..
19 ఏళ్ల కెరీర్‌లో ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఛెత్రి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పట్నించి స్టేడియం మొత్తం అతని నామస్మరణతో ఊగిపోయింది. 68 వేల మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. బాల్‌ను స్ట్రయిక్ చేసినప్పుడుల్లా ఈలలు కేరింతలతో ఫ్యాన్స్‌ను కూడా బాగా ఉత్సాహపరిచారు. అయితే మ్యాచ్ డ్రా కావడంతో ఛెత్రి కాస్త ముభావంగా కనిపించాడు. ఎగిసి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ స్టేడియం మొత్తం కలియదిరిగాడు. రెండు చేతులు జోడించి ఫ్యాన్స్‌కు వందనం చేస్తూ మెల్లగా అక్కడి నుంచి నిష్క్రమించాడు.
ఛెత్రి పేరెంట్స్ ఖర్గా, సుశీల, భార్య సోనమ్ భట్టాచార్య, మ్యాచ్ అఫీషియల్స్, మాజీ ప్లేయర్లు కూడా మ్యాచ్‌కు వచ్చారు. కెరీర్‌లో 94 ఇంటర్నేషనల్ గోల్స్ కొట్టిన ఛెత్రి.. క్రిస్టియానో రొనాల్డో (128), అలీ డే (108), లియోనల్ మెస్సీ (106) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఛెత్రి మరో రెండేళ్ల పాటు క్లబ్ ఫుట్‌బాల్ ఆడనున్నాడు. ఐఎస్‌ఎల్ బెంగళూరు ఎఫ్‌సీతో వచ్చే ఏడాది వరకు అతనికి కాంట్రాక్ట్ ఉంది. ఓవరాల్‌గా 2005లో పాకిస్తాన్‌పై డెబ్యూ చేసిన ఛెత్రి తొలి గోల్‌తో మెప్పించినా... లాస్ట్ మ్యాచ్‌ను గోల్ లేకుండా ముగించాడు.