సిటీ ఫొటోగ్రాఫర్స్, వెలుగు: మహానగరంలో నడుస్తూ వెళ్లడం పెద్ద సాహసమే. ఇంట్లో నుంచి ‘అడుగు’ బయట పెడితే మళ్లీ క్షేమంగా తిరిగి వెళ్తామన్న గ్యారంటీ కూడా లేదు. సుమారు కోటి పది లక్షలకు పైగా జనాభా, 68 లక్షలకు పైగా వాహనాలు, 9013 కిలోమీటర్ల మెయిన్, ఇంటర్నల్ రోడ్లు ఉన్న గ్రేటర్లో 430 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. ఇవి పేరుకే.. భూతద్దం పెట్టి చూసినా కనీసం10 మీటర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే ఫుట్‌పాత్ ఒక్కటీ కనిపించదు. ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై పార్కింగ్‌లకు అడ్డాలుగా, హోటల్స్‌కు సిట్టింగ్ ఏరియాలుగా, పాన్డబ్బాల స్థావరాలుగా, ఇతర షాప్‌ల సామాన్లు, ఫర్నీచర్, డిస్ప్లే ఐటమ్స్ పెట్టుకునే జాగాలుగా, కార్పొరేట్ ఆఫీసులు, హాస్పిటల్స్ సెక్యూరిటీ గార్డులు ఉపయోగించుకునే ప్లేసులుగా మారిపోయాయి.
Also Read:-సర్కార్ భూముల్ని గుర్తించండి
ఒక్కముక్కలో చెప్పాలంటే ఫుట్‌పాత్‌పై బిజినెస్ చేసుకునే వారి కోసం సర్కారు వేయించిన షాబాద్ బండలుగా మారిపోయాయి. మరోపక్క కొన్నిచోట్ల సర్కారు శాఖలే ఫుట్‌పాత్‌లను ఆక్రమించి బస్టాప్‌లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ చెట్లనూ పెంచుతోంది. దీంతో పాదాచారులంతా దిక్కు లేక రోడ్లపై నడుస్తూ యాక్సిడెంట్ల భారిన పడుతున్నారు. ఇందులో కొందరు ప్రాణాలు విడుస్తుండగా, మరికొందరు జీవచ్ఛవాలుగా మారుతున్నారు.
2019 నుంచి 2023 వరకు గ్రేటర్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 248 మంది పాదాచారులు ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. దీనికి కారణాల్లో ఫుట్ పాత్ల ఆక్రమణ కూడా ఒకటి. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ట్రాఫిక్ పోలీసులు గాని పట్టించుకోవడం లేదు. పేపర్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే తొలగించినట్టు హడావుడి చేసి వెళ్లిపోతున్నారు. మళ్లీ ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి యథాస్థితికి చేరుకుంటోంది. కొన్ని చోట్ల సాక్షాత్తు బల్దియా, ట్రాఫిక్ పోలీసుల అనుమతితోనే ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ క్రమంలో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఫుట్‌పాత్‌లపై కూడా దృష్టి పెట్టాలని, లేదా సర్కారు జోక్యం చేసుకుని ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాలని నగరవాసులు కోరుతున్నారు.