షాపు ఖాళీ చేస్తామన్నా.. వినకుండా దాడి

షాపు ఖాళీ చేస్తామన్నా.. వినకుండా దాడి
  • ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్ షాపు నిర్వాహకురాలిపై ఓనర్ దాష్టీకం 
  • రూ.15 లక్షల విలువైన ఫుట్ వేర్ సామగ్రి ధ్వంసం 
  • వనస్థలిపురం పరిధి సాహెబ్ నగర్ లో ఘటన

ఎల్​బీనగర్,వెలుగు: ఆగస్టులో షాపు ఖాళీ చేస్తానని చెప్పినా వినకుండా ఫుట్ వేర్ షాపు నిర్వాహకురాలిపై ఓనర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆపై బాధిత కుటుంబసభ్యులపైనా15 నుంచి 20 మంది విక్షణరహితంగా కొట్టారు. షాపులోని రూ.15 లక్షల విలువైన ఫుట్ వేర్ సామగ్రిని ధ్వంసం చేశారు. షాపు ఓనర్ దాష్టీకానికి కుటుంబమంతా రోడ్డునపడిన ఘటన వనస్థలిపురంలో గురువారం చోటు చేసుకుంది. 

బాధితులు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని వైదేహినగర్ లో శివసింధు స్కూల్ ఎదుట నాలుగేండ్లుగా పుష్ప అనే మహిళ సాయితేజ ఫుట్ వేర్ షాపు నిర్వహిస్తుంది.  షాపు ఖాళీ చేయాలని కొద్దిరోజుల కిందట యజమాని సూచించగా..  ఆగస్టులో చేస్తామని పుష్ప చెప్పగా ఒప్పుకున్నాడు. నెల రోజులుగా మళ్లీ  షాపు ఖాళీ చేయాలని ఓనర్ తీవ్రంగా ఒత్తిడి తేవడమే కాకుండా వారం రోజుల కిందట పుష్పపై దాడికి యత్నించాడు. దీంతో బాధితురాలు వనస్థలిపురం పీఎస్ లో కంప్లయింట్ చేయగా పట్టించుకోలేదు. గురువారం మళ్లీ షాపు ఓనర్ తన అనుచరులతో వచ్చి పుష్పతో పాటు కుటుంబ సభ్యులపైనా విచక్షణ రహితంగా దాడి చేశారు.

అంతేకాకుండా షాపులోని సామగ్రిని బయట వేసి ధ్వంసం చేశారు. షెటర్ కు తాళం వేశారు.  బాధితురాలు పుష్ప పోలీసులను ఆశ్రయించారు. తన ఫిర్యాదుపై పోలీసులు అప్పుడే స్పందిస్తే తనకు న్యాయం జరిగేదని, ఇప్పుడు తన కుటుంబం రోడ్డున పడిందని ఆమె వాపోయింది. షాపులోని సామగ్రిని బయట వేసి నగదు, సెల్ ఫోన్లు  తీసుకున్నారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.