సుప్రీం కోర్టు చెప్పినా ఇండ్ల జాగలిస్తలేరు..20 ఏండ్ల నుంచి పోరాటం

  • 20 ఏండ్లుగా ఆజాంజాహి మిల్లు కార్మికుల భూపోరాటం
  • 318 మందికి మిల్లు స్థలంలోనే జాగలు ఇవ్వాలని సుప్రీం తీర్పు
  •     అమలు చేయకుండా జిల్లా ఆఫీసర్ల నిర్లక్ష్యం
  •     22.24 ఎకరాలు.. ఎకరం విలువ రూ.10కోట్ల పైమాటే
  •     వేరే చోట ప్లాట్లు తీసుకోవాలని లీడర్ల ప్రెజర్‍
  •     మిల్లు స్థలంలో వరంగల్‍ కలెక్టరేట్‍ కట్టేలా లోకల్​ ఎమ్మెల్యే ఆరాటం 
  •     తమ భూములు తమకే ఇవ్వాలని కార్మికుల కన్నీరు 

వరంగల్‍, వెలుగు:  వరంగల్‍ ఆజాంజాహి మిల్లు మూతపడడంతో  వందలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.  కనీసం ఆ స్థలంలో తమకు ఇండ్ల జాగలైన ఇవ్వాలని 20 ఏండ్లుగా పోరాడుతున్నారు. 60 ఏండ్ల వయసులో జిల్లా కోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు చెప్పులు అరిగేలా తిరిగారు. ఎమ్మెల్యే నుంచి రాష్ట్రపతి వరకు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.  చివరకు.. ఏడాదిన్నర కింద వారి పోరాటానికి  ఫలితంగా సుప్రీం కోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. మిల్లు స్థలంలోనే బాధిత కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది.  నాడు ఊరు అవతల ఉండే  మిల్లు స్థలం ఇప్పుడు జిల్లా కేంద్రంలో నడిబొడ్డుగా మారింది.  వందల కోట్ల రూపాయల విలువ పలుకుతోంది. దీనికి చుట్టూరా అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల ప్రాపర్టీలు ఉండడంతో వారి కన్ను ఈ భూములపై పడింది.  ఏదేమైనా కార్మికులకు ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇవ్వొద్దని ప్లాన్‍ వేశారు. వరంగల్‍ కలెక్టరేట్‍ నిర్మాణానికి ఈ స్థలం అనుకూలంగా ఉంటుందని జీవో తీసుకొచ్చారు. 

2002లో మూతపడిన మిల్లు.. 

వరంగల్‍ కేంద్రంగా 60, -70 ఏండ్లు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఆజాంజాహి మిల్లు 2002లో పూర్తిగా మూతపడింది. అందులోని ఉద్యోగులకు సంస్థ  వలంటరీ రిటైర్​మెంట్​  స్కీం ప్రకటించడంతో 452 మంది రిటైర్‍ అయ్యారు. ఆ  టైమ్​లో మిల్లు మేనేజ్​మెంట్​134 మందికి 200 గజాల చొప్పున మిల్లు ఏరియాలోనే  స్థలాలు కేటాయించింది.  దీంతో మిగతా 318 మంది రిటైర్‍ ఉద్యోగులు ‘నేషనల్‍ టెక్స్​టైల్​కార్పొరేషన్‍’ (ఎన్‍టీసీ) పరిధిలో ఉండే మేనేజ్​మెంట్ ను ​ వారి పరిధిలో ఉండే 30 నుంచి 40 ఎకరాల స్థలంలో  తమకు ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్‍ చేశారు.

2021లో సుప్రీం కోర్టులో కార్మికులకు న్యాయం

కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ఎన్‍టీసీ మేనేజ్​మెంట్​ ఒప్పుకోకపోవడంతో దాదాపు 17 ఏండ్ల కింద సీనియర్‍ అడ్వకేట్‍ బొజ్జ తారకం ద్వారా కార్మికులు కోర్టు గడప తొక్కారు. ఏండ్ల తరబడి నడిచిన ఈ కేసును ఆపై తారకం శిష్యులు, సీనియర్‍ అడ్వకేట్‍ చిక్కుడు ప్రభాకర్‍ వాదించారు. మొత్తంగా 2016 మార్చి 18న హైకోర్టు సింగిల్‍ జడ్జి బెంచ్‍ కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఎన్‍టీసీ మరోసారి అప్పిల్‍కు వెళ్లింది. హైకోర్టు డివిజన్‍ బెంచ్‍ ఈసారి 2020 ఫిబ్రవరి 18న కార్మికులకు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దీంతో ఏప్రిల్‍ 1న అడ్వకేట్​ ప్రభాకర్‍ ద్వారా సుప్రీం కోర్టులో స్పెషల్‍ లీవ్‍ పిటిషన్‍ వేశారు. మాడిఫైడ్‍ వలంటరీ రిటైర్మెంట్‍ ఉద్యోగులతో పాటు ఎన్‍టీసీ, మధ్యలో కొన్ని భూములు కొనుగోలు చేసిన ‘కుడా’ వాదనలు విన్నది.  కార్మికుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు 318 మంది ఉద్యోగులకు ఆజాంజాహి మిల్‍  స్థలాల్లో ప్లాట్లు ఇవ్వాలని 2021 అక్టోబర్‍ 26న తీర్పు ఇచ్చింది. దానిని 6 నెలల్లో అమలు చేయాల్సిన బాధ్యతలను రాష్ట్ర మున్సిపల్‍ శాఖ సెక్రటరీతో పాటు ‘కుడా’ వైస్‍ చైర్మన్‍, ఎన్‍టీసీ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది.

కోర్టు ఆదేశాలు అమలు చేయలె..  

ఆజాంజాహి మిల్లు, కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీలకు ఈ ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాలు ఉండడంతో సుప్రీం కోర్టు కార్మికులకు 22.24 ఎకరాలు కేటాయించింది.  వరంగల్‍ నుంచి నర్సంపేట వెళ్లే దారిలో ఉండే ఎన్‍టీసీకి చెందిన 10.24 ఎకరాలు, కుడా  వెంచర్‍ చేసిన ‘ఓ సిటీ’లోని 12 ఎకరాలు కలిపి 22.24 ఎకరాల్లో 318 మందికి 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తీర్పులో ఆదేశించింది. 6 నెలల్లో కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయించాల్సిన ఆఫీసర్లు కోర్టు ఇచ్చిన గడువు ముగిశాక కూడా స్థలాలు ఇవ్వలేదు. దీంతో కార్మికుల తరఫున 2022 జూన్‍ 9న ఆఫీసర్లపై కోర్టు ధిక్కారణ కేసు వేశారు. దీనిపై డిసెంబర్‍ 2న వాదనలు జరగగా.. అప్పటి కుడా వైస్‍ చైర్మన్‍ (ప్రస్తుత వరంగల్‍ కలెక్టర్‍, ఇన్​చార్జి కమిషనర్‍) ను కోర్టు ఆలస్యంపై ప్రశ్నించింది.  జరిగిన ఆలస్యంపై కోర్టు  క్షమాపణ కోరారు. ఈ క్రమంలో కోర్టు బాధితులకు స్థలాలు కేటాయించి 2023 జనవరి 16న పూర్తి రిపోర్ట్​ కోర్టుకు సమర్పించాలని ఆఫీసర్లను  ఆదేశించింది.

20 కిలోమీటర్ల అవతల ప్లాట్లు ఇస్తారంటా..

మిల్లు భూముల్లోని 22.24 ఎకరాల్లో 318 మందికి స్థలాలు ఇవ్వాలని సుప్రీం చెప్పగా.. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఆఫీసర్లు అమలు చేయలేకపోతున్నారు. ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతున్న ఆజాంజాహి మిల్లు  స్థలాల్లో కాకుండా.. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలు, పుట్టలు ఉండే ‘కుడా - మా సిటీ’  వెంచర్‍లో ప్లాట్లు తీసుకోవాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు అక్కడికి వెళ్లిన కార్మికులు ‘మా సిటీ’లో ప్లాట్లు తీసుకోబోమని తేల్చిచెప్పారు. సుప్రీం చెప్పిన ప్రకారం ఆజాంజాహి భూముల్లోనే ఇండ్ల ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్‍ చేస్తున్నారు. ఇదే విషయమై ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి కన్నీరు కారుస్తున్నారు. కోర్టు ఆదేశాల అమలు విషయమై జిల్లా ఉన్నతాధికారులను అడిగే ప్రయత్నం చేయగా వారు స్పందించలేదు.

కలెక్టరేట్‍ పేరుతో.. 

ఓవైపు 318 మంది కార్మికులు తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోర్టు ఆదేశానుసారం డిమాండ్‍ చేస్తుండగా.. ఇదే ఆజాంజాహి మిల్‍ భూముల్లో వరంగల్‍ కొత్త కలెక్టరేట్‍ కట్టేందుకు లోకల్‍ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ ఆరాటపడుతున్నారు. కార్మికుల ఇండ్ల స్థలాల భూమి పక్కనే ఉండే స్థలంలో కలెక్టరేట్‍ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6.16 ఎకరాలు కేటాయిస్తూ 2021 డిసెంబర్‍ 12న ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఎమ్మెల్యే నరేందర్‍ మాట్లాడుతూ.. 2023 మార్చి 10న ఆజాంజాహి మిల్ భూముల్లో మొత్తంగా 27.08 ఎకరాలు కలెక్టరేట్‍ పేరిట ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. ఇందులో కలెక్టరేట్‍ నిర్మాణంతో పాటు వివిధ శాఖల శిక్షణ కేంద్రాలు రానున్నట్లు వెల్లడించారు.  కాగా, ఆజాంజాహి మిల్లు భూముల చుట్టూరా కొందరు నయానో భయానో ముందస్తుగా భూములు కొనుగోలు చేయగా.. ఇంకొందరు ఆజాంజాహి భూములను ఆక్రమించారనే ప్రచారం ఉంది. వీటికి ఊహించని రీతిలో మార్కెట్‍ పెంచేలా కార్మికులకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణ ఉంది.  

మిల్లులోనే ఇండ్ల స్థలాలివ్వాలె

ఇండ్ల స్థలాల కోసం 20 ఏండ్లుగా పోరాటం చేస్తున్నం. 18 ఏండ్ల తర్వాత సుప్రీం కోర్టు మాకు న్యాయం చేసేలా తీర్పు ఇచ్చింది. దానిని అమలు చేయాల్సిన ఆఫీసర్లు ఎన్నిసార్లు బతిమిలాడినా పట్టించుకుంటలేరు. లోకల్‍ ఎమ్మెల్యే, లీడర్లు సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే మడిపల్లి వెంచర్‍లో ప్లాట్లు తీసుకోమంటున్నరు. వాటిని తిరస్కరిస్తూ మేం తీర్మానం చేసుకున్నాం. అధికారం ముసుగులో కోర్టు తీర్పును, మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నరు. అన్యాయం చేశారంటే మాకు చావే శరణ్యం. 
 –ఇనుముల శ్రీనివాస్‍, కార్మికుల అసోసియేషన్‍ గౌరవ అధ్యక్షుడు