ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో కుంభమేళా రైళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో కుంభమేళా రైళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కుంభ మేళా రైళ్ల కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్కు మరో 4 స్పెషల్ ట్రైన్స్ను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఆ రైళల్ వివరాలు ఇలా ఉన్నాయి.

కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ వివరాలు:
1. ట్రైన్ నెంబర్ 04420 (న్యూఢిల్లీ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 7 గంటలకు..
2.  ట్రైన్ నెంబర్ 04422 (న్యూఢిల్లీ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 9 గంటలకు..
3. ట్రైన్ నెంబర్ 04424 (ఆనంద్ విహార్ టెర్మినల్ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 8 గంటలకు..
4. ట్రైన్ నెంబర్ 04418 (న్యూఢిల్లీ to దర్బాంగా జంక్షన్) 16.02.2025 సాయంత్రం 3 గంటలకు..

ఈ స్పెషల్ ట్రైన్లను ఉన్నట్టుండి అందుబాటులోకి తీసుకురావడంపై కూడా ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనేదో ముందే చేసి ఉంటే తొక్కిసలాట జరిగి ఉండేది కాదని ప్రాణ నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలకు రైల్వే శాఖ ముందుకు రావడం సిగ్గుచేటని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. పైగా.. ఏదో గొప్ప పని చేసినట్టు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రయాణికుల రద్దీ ప్రస్తుతం పూర్తిగా తగ్గిందని సోషల్ మీడియాలో రైల్వే శాఖ పోస్ట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మహా కుంభ మేళా ట్రైన్ల విషయంలో శనివారం(ఫిబ్రవరి 15, 2025) గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం కారణంగా ప్రయాణికులు రైళ్లను అందుకోవడానికి పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో చిన్నారులు, మహిళలతో సహా 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, నలుగురు పురుషులు  ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. 

కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్కు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఢిల్లీ రైల్వే స్టేషన్ శనివారం కిక్కిరిసిపోయింది. 14,15 ఫ్లాట్ఫామ్ల దగ్గర జనం కిటకిటలాడారు. ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్కు వెళ్తున్న  రైళ్లు రద్దయ్యాయనే వదంతులు రైల్వే స్టేషన్లో వ్యాపించాయి. దీంతో.. ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ప్లాట్ ఫామ్ నంబర్లు మారిపోయాయనే పుకార్లు, రైళ్లు రద్దయ్యాయనే గందరగోళం కారణంగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లాల్సిన ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.