
- 2 జిల్లాల్లో 47.. 9 జిల్లాల్లో 46.. 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదు
- అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 47.1 డిగ్రీలు
- ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్ టచ్
- రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో ఏడుగురు మృతి
- ఇయ్యాల్టి నుంచి వర్షాలు: వాతావరణ శాఖ
- సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్, వెలుగు : భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతున్నది. రోహిణి కార్తె ఎంటరయ్యాక తొలిసారిగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్టచ్ అయ్యాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి 10 డిగ్రీల హై టెంపరేచర్స్ రికార్డయ్యాయి. ముఖ్యంగా 16 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మరోసారి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు 9 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 నుంచి 46.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఈ సీజన్లో ఇన్ని ఎక్కువ జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతల నమోదు ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరో ఐదు జిల్లాల్లో 45 నుంచి 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బతో ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడ్డారు.
కోల్‌బెల్ట్ భగభగ
కోల్‌బెల్ట్ పరిధిలోని ప్రాంతాలు శుక్రవారం ఎండ వేడితో భగభగ మండాయి. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండలాల్లో జనాలు అల్లాడిపోయారు. జగిత్యాల మినహా (11 మండలాలు) మిగతా మూడు జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నస్పూర్(మంచిర్యాల) 46.9, పాత మంచిర్యాల 46.7, ముత్తారం (పెద్దపల్లి) 46.6, హాజీపూర్ (మంచిర్యాల)లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 46.9, నల్గొండ జిల్లా కేతేపల్లి, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.8, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల 46.4, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 46.3, ములుగు జిల్లా వెంకటాపురంలో 46.2, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 45.9, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 45.7, సిద్దిపేట జిల్లా కట్కూర్, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 45.1 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.
జనగామలో 44.9, మహబూబాబాద్, కామారెడ్డిలో 44.8, నిజామాబాద్, హనుమకొండ, రాజన్న సిరిసిల్లలో 44.7, వనపర్తిలో 44.5, మెదక్, సంగారెడ్డి 43.8, వికారాబాద్43.1, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ 43, మహబూబ్‌నగర్ 42.9, నారాయణపేట 42.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మూసారాంబాగ్‌లో 43.6, బహదూర్‌పుర 43, ఎన్జీవోస్ కాలనీ 42.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
నేటి నుంచి కొంత తగ్గే చాన్స్
రాష్ట్రంలో శనివారం నుంచి ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని పేర్కొన్నారు. గురువారం కేరళతోపాటు దక్షిణ తమిళనాడు ప్రాంతంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. శనివారం తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి, కర్నాటకలోని పలు ప్రాంతాల్లోకి ఎంటరయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోకి త్వరగానే ఎంటరయ్యేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
రైల్వే ట్రాక్‌పై 60 డిగ్రీల టెంపరేచర్
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు బయటకు రావడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో రైల్వే ట్రాక్‌పై గరిష్టంగా 60 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు రైల్వే ఆఫీసర్లు గుర్తించారు. దీంతో రైల్వే ట్రాక్‌ల వెంట పనిచేయడానికి సిబ్బంది జంకుతున్నారు.