సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

 సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం
  • ఎంప్లాయ్స్​కు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ ​కంపెనీలు
  • గేర్, హై ఎండ్, ఎలక్ట్రిక్​సైకిళ్లకు కొనేందుకు ఆసక్తి
  • మునుపటితో పోలిస్తే సేల్స్ డబుల్ అయ్యాయంటున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో సైకిళ్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం, ఫిట్​నెస్​పై ఫోకస్ చేస్తున్న నగరవాసులు సైక్లింగ్​చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైకిళ్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కేవలం శని, ఆదివారాల్లో సైక్లింగ్ మారథాన్ లలో పాల్గొనడమే కాకుండా రోజువారీ పనుల్లోనూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు ఎంప్లాయ్స్ కు హెల్త్, ఫిట్​నెస్ పై అవగాహన పెంచేందుకు ఇన్సెంటివ్‌‌ల కింద, బోనస్‌‌ల కింద సైకిళ్లను ప్రజెంట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు సైకిల్​కొనుక్కునేందుకు మనీ వేస్తున్నాయి. గతంలో స్టూడెంట్స్ ఎక్కువగా సైకిళ్లు కొనేవారని, ప్రస్తుతం ఎంప్లాయ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 
అన్ని పనులకూ వీటి మీదే

సిటీలో సైక్లింగ్ క్లబ్స్, గ్రూపులు అనేకం ఉన్నాయి. దాదాపు 10వేలమంది సైక్లిస్టులు ఉన్నారు. వీరిలో 3వేల నుంచి 4 వేల మంది వివిధ అవసరాలకు డైలీ సైకిల్​నే ఉపయోగిస్తున్నారు. వీకెండ్స్​లో హాలీడేస్ లో మాత్రమే సైక్లింగ్ చేయకుండా రోజూ ఆఫీసులకు, ఇతర పనులకు సైకిళ్ల మీదనే వెళ్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు నెలకి 500 –  600 సైకిళ్లను అమ్మిన వ్యాపారులు ఇప్పుడు ఏకంగా1,500 నుంచి 1,600 వరకు అమ్ముతున్నారు. 
నయా మోడల్స్ కు గిరాకీ
జనం ఎక్కువగా గేర్, హై ఎండ్, ఎలక్ట్రిక్ సైకిళ్లను కొనేందుకు ఎక్కువగా ఆస్తకి చూపిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. గతంలో చైనా కంపెనీల నుంచి సైకిళ్లను ఇంపోర్ట్ చేసుకునేవాళ్లమని, ప్రస్తుతం ఇండియన్ కంపెనీల నుంచే  తీసుకుంటామని అంటున్నారు. హైదరాబాద్ లోని వందల సైకిల్ స్టోర్‌‌‌‌లకు తమిళనాడు, పంజాబ్, యూపీ నుంచి సైకిళ్లు దిగుమతి అవుతున్నాయి. మాములు పెడల్ సైకిళ్లు 6 వేల నుంచి 8 వేలకు ధర ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ సైకిళ్లు 28 వేల నుంచి 85 వేలకు అమ్ముతున్నారు. ఇక గేర్, హైఎండ్ సైకిళ్లు 
11 వేల నుంచి మొదలవుతున్నాయి.
ట్రాక్‌‌లు ఏర్పాటు చేస్తే..
విదేశాల తరహాలో సిటీలో 450 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎలు గతంలో ప్రకటించాయి. కానీ ఏర్పాటు చేయలేదు. సిటీ మొత్తం మీద కేవలం రెండు చోట్ల మాత్రమే అవి కనిపిస్తున్నాయి. అవి కూడా సైకిలిస్టులకు ఉపయోగపడటం లేదు. రోడ్లపై ఎల్లో కలర్ లైన్లు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. విదేశాల్లో సైక్లింగ్ ట్రాక్ లపైకి ఇతర వెహికల్స్ వస్తే భారీ ఫైన్లు వేస్తారు. ఇక్కడ ఆ అవగాహనే లేదు. ఇరువైపులా డివైడర్స్ నిర్మించి ఆ మధ్యలో ట్రాక్ ఏర్పాటు చేస్తేనే సైకిలిస్టులు వెళ్లేందుకు వీలుంటుంది. అయితే ఉన్న ట్రాక్ ల మీద ఇతర వెహికల్స్ ఇష్టానుసారం గా వెళ్తుండడంతో సైక్లిస్టులు ఫ్రీగా తిరగలేకపోతున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన సైక్లింగ్​లైన్​పై డైలీ దర్జాగా కార్లు పార్క్ చేస్తున్నారు. 
డైలీ 10 కిలోమీటర్లు వెళ్తుంటా..

గతేడాది డిసెంబర్​లో హైదరాబాద్ సైక్లిస్ట్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి వారంలో ఒకరోజు ఆఫీసుకు సైకిల్ మీద వెళ్తున్నా. ఆఫీసులో ఓ జత బట్టలు స్పేర్​పెట్టుకుని ఇంటి నుంచి సైక్లింగ్ ట్రాక్​మీదనే వెళ్తాను. బోడుప్పల్ నుంచి దమ్మాయిగూడ వరకు రానుపోనూ 26 కిలోమీటర్లు ఉంటుంది.   ప్రతిరోజు 10 కిలోమీటర్ల చాలెంజ్ తీసుకున్నా. - ఉమామహేశ్వర్ ( ఎంప్లాయ్, బోడుప్పల్)
ఫుల్ రెస్పాన్స్ వస్తోంది
మూడు, నాలుగు నెలల నుంచి సైకిల్ సేల్స్ పెరిగాయి. రోజుకి 70 నుంచి 80 మంది కస్టమర్లు వస్తున్నారు. వారిలో 60 నుంచి 70 శాతం మంది కొంటున్నారు. ప్రైవేట్​కంపెనీలు కూడా ఎంప్లాయ్స్​ని సైకిల్ కొనేందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి. స్కూల్స్ రీఓపెన్ అవుతుండటంతో రెస్పాన్స్ ఇంకా పెరిగింది. - సమీర్ షా,  షాపు ఓనర్, కోఠి
ఐటీ ఎంప్లాయ్సే అధికం
ఒకప్పుడు మా గ్రూప్ లో 50 మందే ఉండేవారు. ఇప్పుడు 4 వేల మంది ఉన్నారు. వీరిలో ఐటీ ఎంప్లాయ్సే అధికం. వీకెండ్స్ లో మాత్రమే కాకుండా లీడర్ చాలెంజ్ అని అన్ని ఏరియాల్లో కొత్తగా ప్రోగ్రాం చేస్తున్నాం. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో వీక్ డేస్ సైక్లింగ్ ఈవెంట్లు పెడుతున్నాం. ప్రతిరోజు ఎంప్లాయ్స్​సజెషన్స్ కోసం కాల్స్ చేస్తుంటారు. ఆఫీసులకు వేసుకుని వెళ్లేందుకు ఎలాంటి సైకిల్ కొనుగోలు చేయాలని అడుగుతుంటారు. ప్రభుత్వం సైక్లిస్టులకు ఉపయోగపడేలా ట్రాకులు నిర్మించాలి. - రవీందర్, ఫౌండర్, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్

 

ఇవి కూడా చదవండి

ఐపీఎల్-15 ప్రైజ్ మనీ.. రికార్డులు

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేసినందుకు..

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స