ఉద్యోగార్థుల కోసం.. బిట్ బ్యాంక్

  • జీవుల మధ్య, జీవులు వాటి పరిసరాల మధ్య ఉన్న సంబంధాల అధ్యయనం ఆవరణశాస్త్రం. 
  • వృక్షజాతి, జంతు జాతి, మానవులు, సూక్ష్మాతి, సూక్ష్మజీవులు గురించే కాకుండా అవి నివసించే ఆవాసాలు– భూమి, గాలి, స్వాదుజల సాగర జీవావరణ వ్యవస్థలు వాటిలో శక్తి ప్రసరణ, పదార్థ వలయాలు, సజీవ నిర్జీవ పదార్థాల మధ్య ఉండే పరస్పర చర్యలు మొదలైనవి ఆవరణ శాస్త్రం పరిధిలోకి వస్తాయి. 
  • తమలో తాము అంతర ప్రయోజనం చెందగల సమాన లక్షణాలున్న జీవుల సమూహాన్నే జాతి అంటారు.
  • ఒక జాతి జీవులు మరో జాతి జీవులతో  లైంగిక వివక్తను కలిగి ఉంటాయి. పర్యావరణంలో అనేక జాతుల మొక్కలు, జంతువులు ఉన్నప్పటికీ ఒక జాతిలోని ఆడ, మగ జీవుల మధ్యనే అంతర ప్రజననం సాధ్యమవుతుంది.
  • ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా లేదా పాపులేషన్​ అంటారు.
  • జనాభా అనేది ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను తెలుపుతుంది.
  • ఏదైనా నిర్దిష్ట ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందిన సూక్ష్మజీవులు, వృక్షాలు, జంతువుల సమూహాన్ని జీవ సమాజం అంటారు.
  • ఒక ప్రాంతంలోని వివిధ జాతుల జనాభాను కలిపి జీవసమాజం అంటారు.
  • జీవావరణ శాస్త్ర నిర్మాణాత్మక, క్రియాశీల ప్రమాణం, జీవావరణ వ్యవస్థ, జీవ, నిర్జీవ కారకాల మధ్య నిరంతరం జరిగే పదార్థాల, శక్తి మార్పిడి వ్యవస్థను జీవావరణ వ్యవస్థ​ అంటారు.
  • ఒక జీవి నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. కాంతి, ఉష్ణం, తేమ అనే భౌతిక లేదా నిర్జీవ కారకాలు ఒక జీవి జీవించే పర్యావరణ ప్రాంతాన్ని నిర్ధారిస్తాయి. 
  • జీవ సమాజంలో ఒక జీవి క్రియాత్మక స్థాయిని ఎకలాజికల్​ నిషే అని అంటారు.
  • ఒక జీవి నివసించే ఆవాసంతోపాటు ఆ జీవి నిర్వహించే విధులను ఎకలాజికల్​ నిషే వివరిస్తుంది. 
  • ఒక జీవి ప్రవర్తన, స్పందన, జీవ సమాజంలోని ఇతర జీవులతో ఇవి జరిపే కార్యకలాపాలు, పరస్పర చర్యలను ఎకలాజికల్​ నిషే అంటారు. 
  • ఒక నిర్దిష్ట వాతావరణం గల విశాల భౌగోళిక ప్రాంతంలోని అన్ని జీవ సమాజాల సముదాయాన్ని జీవ మండలం అంటారు. 
  • జీవులు, జీవం విస్తరించి ఉన్న భూభాగాన్ని జీవగోళం లేదా పర్యావరణ గోళం అంటారు. 
  • భూమి మీద ఉన్న అన్ని రకాల జీవ మండలాలను కలిపి జీవగోళం అంటారు. సముద్ర మట్టానికి 7–8 కి.మీ.ల ఎత్తు వరకు, సముద్రంలో 5 కి.మీ.ల లోతు వరకు జీవులు విస్తరించి ఉన్నాయి. 
  • భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని, ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. 
  • జీవావరణ వ్యవస్థలో ఒక పోషణ స్థాయి నుంచి మరో పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహార రూపంలో శక్తి ప్రసరించే విధానాన్ని ఆహార గొలుసు అంటారు. 
  • వివిధ ఆహార గొలుసుల్లోని పోషణ స్థాయిల మధ్య ఏర్పడే చర్యల ద్వారా తయారయ్యే సంక్షిష్ట వల వంటి నిర్మాణాన్ని ఫుడ్​ వెబ్​ లేదా ఆహార వల అంటారు. 
  • ఒక ఆహార శృంఖంలోని కింది పోషణ స్థాయి జీవుల నుంచి ఆహార మాధ్యమంగా కొన్ని హానికర రసాయనాలు పై పోషణ స్థాయి జీవుల్లో పేరుకుపోవడాన్ని బయోమాగ్నిఫికేషన్​ లేదా బయోలాజికల్​ అక్యుమ్యులేషన్​ అంటారు. 
  • ఒక ఆహార శృంఖంలోని వివిధ పోషణల స్థాయిల మధ్య సంబంధాన్ని సూచించే పిరమిడ్​ నిర్మాణం జీవావరణ పిరమిడ్​.
  • ఎకాలజీని ఆటెకాలజీ, సినెకాలజీ అని రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరిస్తారు. 
  • ఒక జాతికి చెందిన జీవులు, చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ పరిసరాల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడం ఆటెకాలజీ. దీన్ని స్పీసెస్​ ఎకాలజీ అని కూడా అంటారు.
  • అనేక జాతులకు చెందిన జీవుల చుట్టూ ఉండే పరిసరాల మధ్య గల సంబంధ అధ్యయనాన్ని సినెకాలజీ అంటారు. దీన్ని కమ్యూనిటీ ఎకాలజీ అని కూడా అంటారు. 
  • భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. 
  • జీవావరణ అనుక్రమం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చాలాకాలం వరకు అంటే స్థిర సమాజం ఏర్పడేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. 
  • చివరకు ఏర్పడే సమాజాన్ని పరాకాష్ట సమాజం అంటారు. దీంతో సమాజంలో స్థిరత్వం కనిపిస్తుంది. జీవావరణ అనుక్రమంలో మొదట ఏర్పడే సమాజాన్ని పయోనీర్​ అంటారు.
  • దీని తర్వాత అనేక మధ్యంతర సమాజాలు ఏర్పడతాయి. వీటిని సీరల్​ దశలు అంటారు. చివరకు ఏర్పడే సమాజాన్ని క్లైమాక్స్​ అంటారు.