ఒకేసారి ఎన్నికలే దేశానికి మంచిది

ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది ఇండిపెండెన్స్ డే, కాన్‌‌స్టిట్యూషన్ డే సందర్భాల్లో ప్రసంగిస్తూ మన దేశానికి జమిలి ఎన్నికల అవసరాన్ని ప్రస్తావించారు. నాటి నుంచి తరచూ ఆ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. ఒకే దేశం – ఒకే ఎన్నిక అన్న విధానంపై వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ మద్దతునో, వ్యతిరేకతనో వ్యక్తం చేశాయి. అయితే ఇటీవలే కేంద్రం ఎన్నికల సంఘం (సీఈసీ) కూడా జమిలి ఎన్నికలు నిర్వహించే సత్తా తమకు ఉందని ప్రకటించింది. దేశంలో మెజారిటీ పార్టీలు ఈ విధానానికి జై కొడుతుండడంతో కేంద్రం ఇందుకు చట్టపరంగా అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళప్రభుత్వం కచ్చితంగా జమిలికి సంబంధించి చట్టం తేవాలని అనుకుంటే పార్లమెంట్​లో మద్దతు పరంగా సమస్య లేదు. ఇక మిగిలింది ప్రొసీజర్ మాత్రమే. వాస్తవానికి దేశంలో అనేక ఎన్నికల సంస్కరణలకు, రాజకీయ ప్రక్షాళనకు, ప్రజాధనం ఆదా చేయడానికి, పాలన పదేపదే గాడి తప్పకుండా చేసేందుకు జమిలి ఎన్నికలు తక్షణ అవసరమన్న వాదన ఎప్పటి నుంచో ఉంది.

ప్రపంచంలో అతి పెద్ద, బలమైన ఆధునిక ప్రజాస్వామ్య దేశమైన భారత్‌‌లో ఇప్పటికే ఎన్నో ఎన్నికల సంస్కరణలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో సైతం లేని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఆన్‌‌లైన్‌‌లో ఓటు అప్లై చేసుకోవడం, ఓటర్‌‌‌‌ ఐడీ కార్డులు డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవడం లాంటివి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇంకా ఎన్నికలపై నిఘాకు కూడా ఈసీ లేటెస్ట్ టెక్నాలజీలు వాడుతోంది. గతంలో ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ & కాశ్మీర్, కొన్ని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్నికలు జరపడం పెద్ద సమస్యతో కూడుకున్న పనిలా ఉండేది. ఈ రోజు కాశ్మీర్ లాంటి చోట సైతం ప్రశాంతంగా ఎన్నికలు పెట్టగలుగుతున్నాం. రిగ్గింగ్ లాంటి సమస్యలకు చెక్ పెట్టి, ప్రతి ఓటర్ తన హక్కును వాడుకునేలా అధికార యంత్రాంగం పని చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మన దేశ ఎన్నికల సంఘం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అత్యాధునిక విధానాల్లో ఎలక్షన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చకు మాత్రమే పరిమితమైన జమిలి ఎన్నికలను ఆచరణలోకి తెచ్చేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది.

మొదట్లో ఒకేసారే ఎన్నికలు

మన దేశానికి జమిలి ఎన్నికలు కొత్తేం కాదు. దేశంలో 1967 వరకు లోక్​సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1969లో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ విధానానికి బ్రేక్ పడింది. అలాగే ఆ తర్వాత 1971లో మధ్యలోనే లోక్​సభ రద్దయింది. ఆ తర్వాత కూడా పలుమార్లు లోక్​సభ రద్దు కావడం లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వంటివి జరిగాయి. అర్థంతరంగా ప్రభుత్వాలు రద్దయి ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు దాదాపుగా సంకీర్ణ రాజకీయాల కారణంగానే జరిగింది. 1971 తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులతో ఒకే ఎన్నిక విధానం కష్ట సాధ్యంగా మారిపోయింది. కానీ దీని వల్ల ప్రజాధనం వృధా పెరిగిపోయింది. వేర్వేరు సమయాల్లో పదే పదే ఎన్నికలు జరగడం వల్ల అధికారులు, భద్రతా బలగాలపై పని భారం పడుతోంది. అనవసరంగా భారీగా డబ్బు ఖర్చవుతోంది. మరోవైపు రిపీటెడ్​గా ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడడంతో పాటు పాలనా పరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మరోసారి జమిలి ఎన్నికల వైపు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇప్పటికే ఒకే ఎన్నికల విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అమెరికాలో ఒకేసారి  ఎన్నికలతో పాటు బ్యాలెట్ విధానం అమలులో ఉంది. యూకే 2011లో కొత్త చట్టం ద్వారా కచ్చితంగా నిర్ణీత కాలానికి ఎన్నికలు జరిపే విధానాన్ని తెచ్చింది. దక్షిణాఫ్రికా, స్వీడన్ లాంటి దేశాలు రాష్ట్రాల సభలకు, దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి సభలకు ఒకేసారి ఎన్నికలు పెడుతున్నాయి.

ఒకే ఎన్నిక ప్రతిపాదన ఇప్పటిది కాదు

దేశంలో 14వ లోక్​సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ ఎన్నికలను సీఈసీ మొత్తం 9 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. అయితే 1077 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 1349 కంపెనీల ఇతర ఫోర్సెస్​తో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులు, కార్యనిర్వాహక శాఖ ఎన్నికల్లో పని చేయడం వల్ల దాదాపు పాలన వ్యవస్థ మొత్తం కొంత కాలం పాటు అచేతనంగా మారిపోతుంది. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు సుమారు 6000 కోట్లకు పైమాటే. ఇన్ని వేల కోట్ల ప్రజా ధనం తో పాటు విలువైన సమయం కూడా వృధా అవుతుంది. ఇంత ఖరీదైన ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని తక్షణం సవరించాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికల ద్వారా అన్ని ఇబ్బందులను అధిగమించాలన్న ప్రతిపాదన ఈ రోజుది కాదు. జాతీయ లా కమిషన్ 1999 లో ప్రభుత్వానికి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో సమర్పించిన నివేదికలో కూడా జమిలి ఎన్నికలు మేలని సిఫార్సు చేసింది. 2015లో లా అండ్  జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ రిపోర్టులోనూ ఒకే ఎన్నికల విధానంతో మితిమీరిన ఖర్చును తగ్గించొచ్చని పేర్కొంది. నీతి ఆయోగ్ కూడా 2017లో జమిలి ఎన్నికల నిర్వహణపై పలు సిఫారసులు చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించి, ఖర్చు ఏ విధంగా తగ్గించవచ్చన్న దానిపై  సవివరంగా నివేదిక ఇచ్చింది.

చట్టంలో మార్పులు చేయాలె

ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న ఇండియాలో కొత్త సంస్కరణలకు అనేక నిబంధనలు ఆటంకంగా మారవచ్చు. ఇప్పటికే ఒకే దేశం -ఒకే పన్ను, ఒకే దేశం- ఒకే మార్కెట్  లాంటి ఉమ్మడి చట్టాల రూపకల్పనలో అడ్డంకులుగా మారిన రూల్స్ మార్చి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకే దేశం -– ఒకే ఎన్నిక  విధానం అమలు కోసం కూడా చట్టపరంగా మార్పులు చేయకతప్పదు. రాజ్యాంగంలోనూ కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలు ఈ సవరణలను వ్యతిరేకించినా, టీడీపీ, వైసీపీ, బీజేడీ, ఏఐడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు జమిలికి మద్దతుగా ఉన్నాయి. మరి కొన్ని రాజకీయ పక్షాలు లేవనెత్తిన అంశాలు, అభ్యంతరాలపై చర్చలు జరిపి, వాటిని పరిష్కరించడం ద్వారా లీగల్ ప్రొసీజర్ పూర్తి చేయొచ్చు. అయితే జమిలి నిర్వహించే సమయానికి నడుస్తున్న ప్రభుత్వాలను రద్దు చేసి ముందుగా ఎన్నికలు నిర్వహించడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. అలాగే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది, అబ్జర్వర్లు నియామకం, ఒకే ఓటర్ జాబితా ప్రచురించడం, ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించడం వంటి వాటిపై ప్రభుత్వం కసరత్తు చేయాలి.

అనేక సమస్యలకు పరిష్కారం

ఒకే ఎన్నికల విధానం ద్వారా ఇప్పటివరకు ఎన్నికల్లో ఏరులై పారిన డబ్బు, మద్యం ప్రవాహాన్ని , ఇతర ప్రలోభాలను అరికట్టవచ్చు. అలాగే జమిలి ఎన్నికల ద్వారా ప్రభుత్వాల ఒత్తిడి లేకుండా ఒకేసారి ఎలక్షన్ జరిపే వీలుంటుంది. ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేసి అక్రమాలకు తావులేకుండా చూడొచ్చు. రాజకీయ ప్రక్షాళనకు వారధిగా జమిలి ఎన్నికలు మార్గం చూపనున్నాయి. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకో పాలసీ, పార్లమెంట్ ఎన్నికలకో పాలసీ తీసుకునే తీరుకు చెక్ పెట్టొచ్చు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్లుగా, ఎన్నో వైరుధ్యాలున్న మన దేశంలో ఈ జమిలి ఎన్నికలతో  ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ శాతాన్ని కూడా భారీగా పెంచి బలమైన ప్రభుత్వాలను స్థాపించవచ్చు. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు, జాతీయస్థాయిలో ప్రభావవంతమైన నాయకత్వం చూపే వీలు కలుగుతుంది.  ‘ఆదర్శ రాజ్య భావనలో తత్వవేత్తలే పాలకులు కావాలి పాలకులు అందరూ తత్వవేత్తలు కావాలి’ అని ప్రాచీన గ్రీకు తత్వవేత్త చెప్పిన మాట సాకారం అవుతుంది. రాజకీయాల్లో కార్పొరేట్ శక్తుల ప్రభావాన్ని అడ్డుకోవడమే కాక నిజమైన ప్రజా సేవ చేసే నాయకుల్ని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం వస్తుంది. నిర్బంధ ఓటు వినియోగించాలన్న సంస్కరణలు, ఈ– ఓటింగ్, ఎన్నారైలకూ  ఓటు హక్కు కల్పించాలన్న డిమాండ్లను కూడా ఆచరణలో పెట్టేందుకు జమిలి ఎన్నికల విధానం ఉపయోగపడుతుంది. – డాక్టర్ దొంతగాని వీరబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్,  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ