హైదరాబాద్, వెలుగు: కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలు రేషన్ కార్డుల కోసం మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేరు, అడ్రస్, ఇతర మార్పులు కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.కార్డుల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని స్పష్టంగా పేర్కొంది.
అర్హులందరికీ కార్డులు ఇస్తం
ఈ మేరకు మీసేవ కమిషనర్ కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. రేషన్ కార్డుల డేటా బేస్ ను మీసేవకు అనుసంధానం చేయాలని ఎన్‌ఐసీని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కోరారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. గతంలో ప్రజాపాలన సదస్సులు ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి.
హైదరాబాద్ ప్రజాభవన్ తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీసేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించాలని.. అర్హులందరికీ కార్డులు అందేందుకు వీలుంటుందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.