సూర్యాపేట, వెలుగు : త్వరలోనే ఖాళీ చేయాల్సిన సూర్యాపేట కలెక్టరేట్ బిల్డింగ్‌కు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త షోకులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలోనే మొట్టమొదట శంకుస్థాపన చేసిన సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు పూర్తి చేయకుండా, ప్రైవేట్ బిల్డింగ్ రిపేర్లకు పైసలు ఖర్చు పెట్టడం ఏంటని అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం కలెక్టరేట్ నడుస్తున్న బిల్డింగ్‌ను జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత కొనుగోలు చేయడంతో అద్దె రూపంలో ‘పెట్టుబడి’ వచ్చే వరకు కలెక్టరేట్‌ను ఇక్కడే కొనసాగించే ప్లాన్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నత్తనడకన కొత్త కలెక్టరేట్ పనులు
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత మొట్ట మొదటగా సూర్యాపేటలోనే కలెక్టరేట్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 12న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 32 డిపార్ట్‌మెంట్ల కోసం రూ.48 కోట్ల అం చనాతో బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ బిల్డింగ్ పక్కనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల క్యాంప్ ఆఫీస్‌లు, జిల్లా ఆఫీసర్ల కోసం మరో 8 క్వార్టర్స్ సైతం నిర్మిస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లలోనే బిల్డింగ్ పూర్తి కావాల్సి ఉంది. సూర్యాపేట తర్వాత చాలా జిల్లాల్లో శంకుస్థాపనలు జరిగిన కలెక్టరేట్లు ఇప్పటికే పూర్తై ప్రారంభోత్సవాలు సైతం జరిగాయి. కానీ శంకుస్థాపన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా సూర్యాపే ట కలెక్టరేట్ పనులు మాత్రం 70 శాతమే కంప్లీట్ అ య్యాయి. ఇంకా ఆఫీస్ లోపల ఫినిషింగ్, మెయిన్ ఎంట్రెన్స్, సీసీ రోడ్లు, క్యాంప్ ఆఫీస్‌లను నిర్మించాల్సి ఉంది. అయితే బిల్లులు ఇన్‌టైంలో అందకపోవడం, కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే చెల్లించడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాత బిల్డింగ్‌కు రిపేర్లు
కొత్త కలెక్టరేట్ నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో అద్దె బిల్డింగ్‌లో నడుస్తున్న పాత కలెక్టరేట్‌కు లక్షల రూపాయలు ఖర్చు చేసి రిపేర్లు చేస్తున్నారు. రూ. 60 లక్షలు రిలీజ్ కావడంతో బిల్డింగ్‌కు కలర్స్ వేయడం, ఆఫీసులో మ్యాటింగ్, సీసీ కెమెరాలు అమర్చడం, ఎలక్ట్రికల్ వర్క్స్, వైరింగ్ పనులు చేపట్టారు. అయితే కొత్త బిల్డింగ్‌కు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాల్సిన ప్రభుత్వం, ఆ విషయాన్ని పట్టించుకోకుండా పాత బిల్డింగ్ కోసం లక్షలాది రూపాయలు కేటాయించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.