- బౌన్సర్లతో వచ్చి మాల్లో హడావుడి
- బలవంతంగా బయటికి పంపిన మాల్ సిబ్బంది
గచ్చిబౌలి, వెలుగు : తన ఫాలోవర్లు ఎవరు ముందు వస్తే.. వారికి డబ్బు పంచుతానంటూ కురపాటి వంశీ అనే యూట్యూబర్ శుక్రవారం గచ్చిబౌలిలోని శరత్‌సిటీ క్యాపిటల్మాల్(ఏఎంబీ మాల్)లో హల్ చల్ చేశాడు. చుట్టూ బౌన్సర్లు, కెమెరాలతో మాల్‌కు చేరుకున్నాడు. అదంతా వీడియో తీసి ఫాలోవర్లు ఎవ్వరైనా ఉంటే వెంటనే మాల్ లోని సెకండ్ ఫ్లోర్ కి రావాలని, మొదట వచ్చిన వారికి డబ్బు పంచుతానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేశాడు. వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన మాల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
మాల్లో వీడియో తీయడం నిషేధమని చెప్పారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, యూట్యూబర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. చివరికి సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా యూట్యూబర్ ని బయటికి పంపించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ‘ఇట్స్ మీ పవర్’ అనే ఇన్‌స్టా అకౌంట్లో వంశీ తన వీడియోను పోస్ట్చేయగా, శనివారం సోషల్ మీడియాలో వైరల్అయింది.
అయితే వంశీ గతంలో ఇలాగే కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ రోడ్లపై గాల్లోకి డబ్బు విసురుతూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.