అక్టోబర్ 20 తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్

  • రాహుల్, ప్రియాంక టూర్ల వల్లే లిస్ట్ కాస్త ఆలస్యం 
  • లెఫ్ట్ పార్టీలకు చెరో రెండు సీట్లు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్ కాస్త వాయి దా పడేలా కన్పిస్తోంది. ఈ నెల 20 తర్వాతే ఈ లిస్ట్ విడుదలయ్యే చాన్స్​ ఉందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. 18లోపు పూర్తి స్థాయిలో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించాలని తొలుత నిర్ణయించింది. రెండు లిస్ట్ లుగా తయారు చేసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)కి పంపగా..55 మందితో తొలి లిస్ట్ ఈ నెల 15న రిలీజ్ అయింది. మిగిలిన స్థానాలకు సంబంధించి సెకండ్ లిస్ట్ 18లోపు రిలీజ్ చేయాలని పార్టీ నిర్ణయించింది. 

అయితే, రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక టూర్ల కారణంగా లిస్ట్ రిలీజ్ ఆలస్యం కానున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. లెఫ్ట్ పార్టీల పొత్తు విషయంలోనూ క్లారిటీ వస్తుందని నేతలు తెలిపారు. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లు కేటాయించేలా లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మధ్య అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. చెరో మూడు సీట్లివ్వాలని లెఫ్ట్ పార్టీలు ముందు నుంచీ పట్టుబట్టాయి. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్.. సీపీఎంకు పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం ఇవ్వాలని కోరాయి. 

కానీ, కాంగ్రెస్ ఇప్పటికే భద్రాచలం సీటును పొదెం వీరయ్యకు ప్రకటించింది. మిగిలిన ఐదు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇం దులో మునుగోడు, కొత్తగూడెం సీట్లను సీపీఐకి ఇవ్వ నున్నట్టు తెలిసింది. సీపీఎం కోరుతున్న పాలేరు స్థానాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించనున్నట్టు సమాచారం.