తెలంగాణ గొంతైందని బ్యాన్​జేస్తవా

తెలుగు మీడియాలో తెలంగాణ వార్తలకు తావులేని యాల్ల... తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ కోసం కలెవడి, నిలవడి కొట్లాడింది మన V6. ఓయూ ఉద్యమాలకు కెమెరా అయింది. జేఏసీ పోరాటాల జెండావట్టింది. సకల జనులకు గొంతయింది. మేధావుల చర్చలకు వేదికయింది. సాగరహారానికి మాటల దండయింది. ఏడ తెలంగాణ మాట ఇనవడ్తే ఆడ నిలవడ్డది. నినదించేటోళ్లకు నిలువుటద్దమయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి తోడు తిరిగినం. మన వీరులను తల్సుకున్నం, మన కవులను కొల్సుకున్నం, మట్టి కప్పిన మన చరిత్రను తొవ్వి తీశినం, బోనం పూదిచ్చినం, బతుకమ్మ పేర్శినం. శిన్మొళ్లే శిన్నవొయ్యేతట్టు ఉద్యమ పాటలు కైగడితే.. యావత్ తెలంగాణ ఇది మా ఛానల్, మన ఛానల్ అని గుండెల్ల పెట్టుకుంది. రాయల తెలంగాణ రాజకీయాలను, హైద్రాబాద్ కేంద్రపాలిత ప్రాంత కథలను, సమైక్యవాద కుట్రల మీద వార్తలు రాశి మూడున్నర కోట్ల మంది ఆకాంక్షలను ఢిల్లీ పాలకులను ఎర్కజేశిన ఛానల్. పెప్పర్ స్ర్పే దాడులు, కత్తుల వీరంగాల నడ్మ తెలంగాణ బిల్లు పాసైన్నాడు పది జిల్లాల్ల ఎంత పండుగైందో మా ఆఫీసుల అంతే సంబురమైంది. ఆడబిడ్డలకు బతుకమ్మ పాటల పండుగ తెచ్చింది మనమే. బోనాల పండుగ దరువు పాటలు షురూ జేశిందీ మనమే. మన రాతగాళ్లను, మన పాటగాళ్లను, మన దరువును టీవీలకెక్కిస్తే ఊరూర తీన్మారై మోగుతున్నయి. అప్పటిదాకా ఈ సోయి ఎవలకు లేకుండే. తీన్మార్ వార్తలు ఓ చరిత్ర. సూటు బూట్ యాంకర్లు, గొట్టు 

పదాలుంటెనే వార్తలు అన్కునేటోళ్లు. కని గోశి వెట్టిన తాత.. కాళ్ల కడాల అవ్వ.. లొడాసు లాగుల బిత్తిరోడు.. బుగ్గల జాకిట్ల అక్కలు, లంబాడా చెల్లెలు... ఆటో అన్నలతోటి వార్తలు చెప్పిస్తే.. పశివోరల కాంచి పండు ముసలిదాకా కాయిశ్ జేస్తుండ్రు. మన భాషను ఎక్కిరించినోళ్లే, గిదేం యాసని నవ్వినోళ్లే.. ఇయ్యాల మన తీన్మార్ను జిరాక్స్ తీశి తీరొక్క పేర్లతోటి అన్ని టీవీల్ల సూపిస్తున్నరు. తెలంగాణ కోసం ఎంత కొట్లాడినమో తెలంగాణొచ్చినంక కూడా అదే కొట్లాట మనది. నీళ్ల కోసం ప్రశ్నిస్తున్నం.. నిధుల లెక్కలు అడుగుతున్నం.. నియమాకాల కోసం నిలదీస్తున్నం. ఇచ్చిన హామీలు యాజ్జేస్తున్నం..  చెప్పిన మాటలు గుర్తు జేస్తున్నం. తప్పైతే ప్రశ్నిస్తున్నం... మంచైతే తారీఫ్ జేస్తున్నం. కనిది సర్కారోళ్లకు జీర్ణమైతలేదు. ఇన్రోజులు ముఖ్యమంత్రి సారు మన రిపోర్టర్లకు ధమ్కీలు మాత్రమే ఇచ్చేది... ఇప్పుడు V6, వెలుగు బ్యాన్ జేస్తం అనవట్టే ముఖ్యమైన మంత్రి రామన్న. అన్నకు తెల్సోలేదో.. టీవీల గాకుంట యూ ట్యూబ్, ఫేస్బుక్, ఇన్ స్ట్రా, టిట్టర్, e  పేపర్, షేర్ చాట్ అన్ని కలేస్తే... ఏందక్వ కోటిన్నర మంది ఫాలో ఐతుండ్రు మనల్ని. దినాం కోటి మంది సూస్తరు. అంటే తెలంగాణల సగం మందిని బ్యాన్ జేస్తరన్నట్టా..? ఆళ్లందర్కి తెలంగాణ వార్తలు తెల్వొద్దా..? కడ్మ టీవీలయి రొండు కండ్ల సిద్దాంతం లెక్క. ఎక్కడ మసాలా వార్త ఉంటే అక్కడికి తిప్పుతరు. కని మనకు తెలంగాణే వార్త... మన వార్తే తెలంగాణ. 

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నరు గావట్టే అట్లనే ఉంటే... అదేమో ఇప్పుడు నచ్చుతలేదు. మన కోసం, మన పార్టీ కోసం బొచ్చెడు పేపర్లు, టీవీలు ఉన్నయి. పబ్లిక్ కోసం తండ్లాడేది ఒక్కటుంటే తట్టుకోకుంటే ఎట్ల సారు..? బాపు భాషల చెప్పాలంటే తెలంగాణల ఫుల్లు డిమాండున్న ఛానల్ను.. పబ్లిక్ కోరుకునే ఛానల్ను బ్యాన్ జేశి.. ప్రజాస్వామ్యానికి పాడెగట్టి.. మీడియా స్వేచ్చకు ఉరేశి.. ఊరేగే రోజు ఎన్నడో ఎదిరి సూస్తుంటం.. చీకట్ల వార్తలు వెలుగులకు తెస్తనే ఉంటం. 

ఇది తెలంగాణ మీడియా హౌజ్.. తగ్గేదేలే.

ఔ... బ్యాన్​జెయ్యాల్సిందే

మనమిస్తన్న డబుల్ బెడ్రూంలు ఏమాయే.. దళితులకు మూడెక్రాలు ఎటువాయే.. లోన్ల మాఫీ ఎన్నడు.. దళిత బంధు అందేదెప్పుడు.. ధర్నాచౌక్ ఉండాలే... ప్రజాసంఘాలను కాపాడుకోవాలే.. ప్రతిపక్షాలు మిగులనియ్యాలంటే ఎట్ల మరి..? లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ మునుగుడు సూపెట్టుడు తప్పే. 5 లక్షల కోట్ల అప్పు గురించి రాసుడు తప్పే. పోడు పట్టాలు పంచాలన్నందుకు... హాస్టల్ల మంచి బువ్వ పెట్టాలన్నందుకు... రైతుల కోసం కొట్లాడ్తున్నందుకు... దళితుల తర్పున నిలవడ్డందుకు... నోరు లేనోళ్లకు గొంతయినందుకు... V6, వెలుగును బ్యాన్ జెయ్యాల్సిందే. మనకెవలు కావాలంటే తెలంగాణ ఉద్యమం మీద ఇసం కక్కినోళ్లు, రొచ్చు రాతలు రాశినోళ్లు. ఆళ్లను ఇంటికి పిల్సుకోని మర్యాదలు... ఆఫీస్కువొయ్యి పరామర్శలు... కోట్ల రూపాల ప్రకటనలు. మన భాషను, యాసను, తిండిని, కట్టును, బొట్టును ఎక్కిరించినోళ్లు అల్లంబెల్లమైండ్రు. తెలంగాణ కోసమే పుట్టిన మీడియా హౌజ్ నిలవడుతుంటే కండ్లమంటేగద మరి. పెద్ద సారుది బొక్కలేని చెయ్యాయే. పబ్లిక్ పైకంతోటి దేశమంత పేపర్ల నిండా అడ్వర్ టైజ్ మెంట్లు ఇస్తరుగని తెలంగాణల ఉన్న V6, వెలుగు కు ఇయ్యాలంటే పాణం దరియ్యది. తెలంగాణొస్తే గింత మార్తది అనుకోకవోతిమి. మనసుల మంచిగనే పెట్టుకుండ్రు. గుజరాత్ లో కల్తీ మందు తాగి సచ్చివోతే.. మీ ఛానల్ల సూపిచ్చిండ్రా.. అని అడిగిండు రామన్న. నిరుడు జూలై 26 తారీఖునాడు బరాబర్ సూపిచ్చినం. ఉన్నది ఉన్నట్టు సూపియ్యకుంటే V6 ఏమన్న పార్టీ ఆఫీసుల నడిశే ఇంటి గుండె సప్పుడు ఛానలా..? 4 కోట్ల మంది గుండెలల్లున్న ఛానల్. మన వెలుగు ఏ పార్టీకి నమస్తే కొట్టది, గుమస్తాగిరి, గులాంగిరి అసలే జెయ్యది. 

V6 వెలుగు ఫ్యామిలీ తరఫున..- రఘు భువనగిరి