మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ టెంపుల్‌కు రూ. 50 కోట్లు, జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి టెంపుల్ అభివృద్ధికి రూ. 6 కోట్లు మంజూరు అయ్యాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జీవో కాపీని టెంపుల్ చైర్మన్ అందించి మాట్లాడారు. మన్యంకొండను జిల్లాలోనే అతిపెద్ద టెంపుల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 25 కోట్లు, నెక్ట్స్ ఇయర్ రూ. 25 కోట్లతో పనులు చేపడుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోపే వేను ఏర్పాటు చేస్తున్నామని, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తునామన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనర్సింహ్మస్వామి టెంపుల్‌కు సంబంధించి కమిటీ మెంబర్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు పాల్గొన్నారు.
అచ్చంపేటలో బీజేపీ జెండా ఎగరేస్తాం
లింగాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో అచ్చంపేటలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నేత సతీశ్ మాదిగ దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం లింగాల మండలం అంబటిపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 100 కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ అభివృద్ధి చెందలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా పక్కదారి పట్టించారని విమర్శించారు. బీజేపీ లింగాల మండలం అధ్యక్షుడు యాదగిరి సలేశ్వరం, జనరల్ సెక్రటరీ యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు విష్ణు చారి, నేతలు నవీన్, ప్రభాకర్, సుధాకర్ పాల్గొన్నారు.
జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవర్ధన్‌రెడ్డి
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్‌గా గంగాపూర్ గ్రామానికి చెందిన మన్యం గోవర్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్టణంలోని నిమ్మబావిగడ్డకు చెందిన మహ్మద్‌అలీ దానీశ్‌ను నియమించింది. మిడ్జిల్మండలం బైరంపల్లికి చెందిన కాడయ్య, మున్ననూర్‌కు చెందిన కె. వెంకటయ్య, జడ్చర్లకు చెందిన ఎస్. శ్రీనివాస్, ఆలంపల్లి ప్రదీప్, మహ్మద్ సుభాన్అలీ, ఊర్కొండ మండలం మాదారానికి చెందిన వీరారెడ్డి, జడ్చర్లకు చెందిన కొంగళి నాగరాజు, భాను ప్రకాశ్, పి.వినోద్‌కుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, రామావత్ ఘవార్, ట్రేడర్ కంచుకోట గోపాల్‌కు డైరెక్టర్లుగా నియమించింది. వీరితో పాటు బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్రం
వనపర్తి, వెలుగు: కేంద్రం చేనేత రంగంపై జీఎస్టీని విధించి, నేతన్నల నడ్డి విరుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వనపర్తి జిల్లాకేంద్రంలో చేనేత హస్తకళా ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని ప్రధాని కార్యాలయానికి పోస్ట్ కార్డుల ద్వారా వినతులు పంపినా చలనం లేదన్నారు. చేనేతలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరలు, క్రిస్మస్ , రంజాన్ తోఫాల తయారీని వారికే అప్పజెప్తూ ఉపాధి కల్పిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంత్రి కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 232 కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, 205 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.
16 మీసేవ సెంటర్లపై చర్యలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న 16 మీసేవ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ కలెక్టర్ ఎస్. మోతిలాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేల్ మీటింగ్ హాల్‌లో జిల్లాలోని 134 మీసేవ కేంద్రాల ప్రతినిధులతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16 మీసేవ కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరుగురితో కూడిన మూడు టీంలు ఏర్పాటు చేసి మారువేషంలో ఎంక్వైరీ చేయించామన్నారు. ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్లు తేలిందని వారిపై రూల్స్ మేరకు చర్యలుంటాయని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను సెంటర్ వద్ద డిస్‌ప్లే చేయాలని, జిరాక్సులు, స్కానింగ్‌ల పేరిట ప్రజల సొమ్ము దోచుకుంటే ఊరుకునేది లేని హెచ్చరించారు.
సమస్యలు తీర్చకుంటే సమ్మె చేస్తాం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ హెచ్చరించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీఆర్ఏలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలల కింద అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే మునుగోడు ఎన్నికల తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ మాటిచ్చారని గుర్తుచేశారు. అయినా అలాగే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రామయ్య, అశోక్, సాయి, ధర్మేందర్, సిద్ధన్న,
సలేశ్వరం పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు
నారాయణపేట, వెలుగు: మిషన్ భగీరథ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ వనజమ్మ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జడ్పీ ఆఫీసులో ఆర్థిక ప్రణాళిక, నిర్మాణ పనుల స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ సబ్సీడీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలన్నారు. ధన్వాడ, మరికల్‌లో మిగిలిన భగీరథ ట్యాంకులను వెంటనే పూర్తి చేసి.. నీళ్లు అందించాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఆర్‌ఆర్ పనులు, ,ఎఫ్‌డీఆర్, గ్రామపంచాయతీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన బిల్డింగ్ పనులు ప్రారంభం కాని చోట క్యాన్సల్ చేసి మరో గ్రామానికి కేటాయించాలని సూచించారు. అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ స్థాయి సంఘ సమావేశం, జడ్పీటీసీఉ లావణ్య, విమలాదేవి ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమశాఖ సమావేశం
నిర్వహించారు.
హాస్పిటల్‌లో సమస్యలుంటే చెప్పండి
నారాయణపేట, వెలుగు : హాస్పిటల్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష డాక్టర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద పడకల చిన్న పిల్లల దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, రోగులకు డాక్టర్లకు రాసిచ్చే మందులు, రక్త పరీక్షల వివరాలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్, డాక్టర్ క్రాంతి కుమార్ ఉన్నారు.