తగ్గిన పత్తి దిగుబడి..మార్కెట్ చరిత్రలో ఫస్ట్ టైం రూ.7 వేలు దాటని రేటు

  •    24 లక్షల క్వింటాళ్లకు మార్కెట్​కు వచ్చింది 13 లక్షల క్వింటాళ్లే..
  •     ఈ ఏడాది తగ్గిన పత్తి దిగుబడులు
  •     మార్కెట్ చరిత్రలో ఫస్ట్ టైం రూ.7 వేలు దాటని రేటు
  •     ధర పెరుగుతుందనే ఆశతో రైతన్న

ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన మంగారపు రామన్న ఈ ఏడాది 12 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇప్పటి వరకు 40 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పంటను రూ.7 వేల చొప్పున అమ్ముకోగా.. పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదని వాపోతున్నారు. అధిక వర్షానికి మొలక దశలో నాలుగు ఎకరాల్లో పంట కొట్టుకుపోయి నష్టం జరిగిందని.. దిగుబడి తగ్గిపోవడానికితోడు ధర లేకపోవడంతో ఈ సారి నష్టం జరిగింది.

ఆదిలాబాద్, వెలుగు : తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తి పంట ఆదిలాబాద్ రైతులకు ఈసారి నష్టాలను మిగిల్చింది. పంట ఏరడం, కొనుగోళ్లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో పత్తి మార్కెట్ కు రాలేదు. దిగుబడులు తగ్గిపోవడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలో పత్తి పంట దిగుబడులపై అధికారులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా..

దాదాపు 24 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు మార్కెట్​కు వచ్చింది 13 లక్షల క్వింటాళ్లు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో అంచనాలు అందుకోవడం కష్టమే. ధర పెరుగుతుందనే ఆశతో కొంత మంది రైతులు ఇంకా పంటను ఇండ్లలో నిల్వ చేసుకున్నారు. మరో 2 నుంచి 3 లక్షల క్వింటాళ్ల వరకే మార్కెట్​కు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే..

అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది మొలక దశలో దాదాపు 35 వేల ఎకరాల్లో కొట్టుకుపోయింది. రెండోసారి విత్తుకున్నప్పటికీ ఎదిగే సమయంలో అకాల వర్షాల కారణంగా పూత, కాయ రాలిపోయింది. దీనికితోడు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వాతావరణ మార్పుల కారణంగా మొక్కలు ఎదగలేదు. ఇలా పలు కారణాలు పంట దిగుబడులపై ప్రభావం చూపాయి. ఎకరానికి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించినప్పటికీ 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.

ఈ సారి పెట్టుబడి ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి. మొదటిసారి ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేయగా.. వర్షాలకు దెబ్బతిన్న చేన్లకు మళ్లీ రూ.10 వేల నుంచి రూ.15  వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. పంట దిగుబడి లేక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రూ.7 వేలు దాటని ధర

ఆదిలాబాద్​పత్తి మార్కెట్ చరిత్రలోనే ఊహించని విధంగా ఈ సారి ధర పడిపోయింది. ప్రతి ఏటా ప్రైవేట్​ వ్యాపారులు క్వింటాలుకు కనీసం రూ.8 వేలకు పైగా చెల్లించి కొనేవారు. కానీ ఈ ఏడాది రూ.7 వేలు కూడా ధర ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం పడిపోయింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ తగ్గిపోవడం కూడా మద్దతు ధర పెరగకపోవడానికి కారణంగా చెబుతున్నారు. సీసీఐ ప్రకటించిన ధర రూ.7020కే పంటను అమ్ముకున్నారు.

ఇప్పటి వరకు సీసీఐలో 10 లక్షల క్వింటాళ్లకు పైగానే కొనుగోళ్లు జరిగాయి. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో కొందరు రైతులు పంటను ఇండ్లలో నిల్వ చేసుకున్నారు. ఫిబ్రవరి వరకు పూర్తిస్థాయిలో పంట మార్కెట్​కు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా పత్తి రైతుల పెట్టుబడి పెరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో గిట్టుబాటుకావడం లేదు.

దిగుబడి తగ్గిపోవడంతో అంచనా అందుకోలేదు

జిల్లాలో పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈసారి మార్కెట్​కు ఆశించిన స్థాయిలో పంట రాలేదు. 24 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేశాం. ఇప్పటి వరకు 13 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. పంట కొనుగోళ్లు ముగిసే వరకు మరో 3 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పత్తి డిమాండ్ లేకపోవడంతో మద్దతు ధర కూడా తక్కువగా ఉంది. జిల్లాలో ఇంత తక్కువ ధరకు తగ్గికొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి.  

శ్రీనివాస్, ఏడీ, మార్కెటింగ్

తీవ్రంగా నష్టపోయాం 

 నేను 18 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇటు దిగుబడి రాక, అటు ఆశించిన ధరలు లేక పెట్టుబడులు కూడా రాలేదు. ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.   

బొడ్డు శ్రీనివాస్, పత్తి రైతు, బోథ్