ఏటూరునాగారం, వెలుగు: రాష్ట్రంలో తొలిసారి కంటెయినర్ స్కూల్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి జీపీ పరిధిలోని బంగారుపల్లి గొత్తికోయగూడెంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. బంగారుపల్లి పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్నందున ఆ గ్రామంలో శాశ్వత స్కూల్బిల్డింగ్ నిర్మాణానికి అటవీ శాఖ అనమతులు ఇవ్వలేదు. దీంతో టీచర్లు, విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్న పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్కూల్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ గ్రామం లింగాలలో కంటెయినర్ ఆస్పత్రిని ఏర్పాటుచేసిన విధంగా బంగారుపల్లిలో కంటెయినర్ స్కూల్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ దివాకరను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.13.50 లక్షల అంచనా వ్యయంతో కలెక్టర్ నిధులు రూ.13 లక్షలతో వినూత్నంగా కంటెయినర్ స్కూల్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్కూల్ లోపల టీచర్లు, విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, డ్యూయల్ డెస్క్ టేబుల్స్, ఫ్యాన్లతో పాటు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఈ కంటెయినర్స్కూల్ను మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు బంగారుపల్లి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.