టెల్​అవీవ్ పైకి బాలిస్టిక్ మిసైల్..22మంది మృతి

టెల్​అవీవ్ పైకి బాలిస్టిక్ మిసైల్..22మంది మృతి
  • హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణిని పేల్చేసిన ఇజ్రాయెల్ 
  • లెబనాన్​పై కొనసాగిన భీకర వైమానిక దాడులు

జెరూసలెం/బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీకి, లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ కు మధ్య వరుసగా మూడోరోజు భీకర దాడులు జరిగాయి. బుధవారం ఉదయం టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ పైకి హెజ్బొల్లా ‘ఖాదర్–1’ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా.. దానిని ఇజ్రాయెల్ ఆర్మీ గాలిలోనే పేల్చివేసింది. 

బాలిస్టిక్ మిసైల్ తోపాటు ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను కూడా హెజ్బొల్లా ప్రయోగించింది. దీంతో లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లు బాంబుల వర్షం కురిపించాయి. దక్షిణ లెబనాన్ లోని ఓ ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు గుర్తించామని, ఆ ప్రాంతంతోపాటు ఇతర టార్గెట్లపై తమ ఫైటర్ జెట్ లు బాంబులు వేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. 

ఇక ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం మరో 22 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల్లో లెబనాన్ లో మృతిచెందిన వారి సంఖ్య 591కి చేరింది. మృతుల్లో 50 మంది పిల్లలు ఉండగా.. బాంబు దాడుల్లో1,835 మంది గాయపడ్డారు. అలాగే గాజాలో మరో 28 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 41,500కు పెరిగింది. 

ఇక మంగళవారం హెజ్బొల్లా మిసైల్స్ అండ్ రాకెట్స్ యూనిట్ చీఫ్ ఇబ్రహీం కుబైసీని హతమార్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తత మరింతగా పెరిగినట్టయింది. లెబనాన్ ప్రజలను హెజ్బొల్లా మానవ కవచంగా వాడుకుంటోందని, అందుకే ప్రజలంతా ఆ దేశం విడిచి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం హెచ్చరికలు జారీ చేశారు. 

కాగా, లెబనాన్​లోని రష్యన్లు వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి బయటకు రావాలంటూ రష్యా ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించింది. తమ పౌరులను తరలించడానికి గాను బ్రిటన్ సర్కారు 700 మంది బలగాలను పంపింది.  

లీడర్లను చంపినా.. హెజ్బొల్లా వీక్ అవదు: ఖమేనీ 

హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ హతమారుస్తూ వస్తోందని, అయినా లీడర్లను చంపినంత మాత్రాన ఆ సంస్థ ఏమాత్రం బలహీనం కాబోదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. హెజ్బొల్లాకు ఇరాన్ అండదండలు అందిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థకు మద్దతుగా ఖమేనీ ఈ మేరకు బుధవారం ప్రకటన చేశారు.

 కాగా, లెబనాన్ పై వైమానిక దాడులు ఆమోదయోగ్యం కాదని, వాటిని వెంటనే ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అమెరికా లోనూ మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి.