వద్దిపేట.. వట్టిమాటేనా 30 ఏళ్లుగా కొనసాగని చెక్‌‌ డ్యాం నిర్మాణం

 
  • 7 వేల ఎకరాలకు సాగునీరు కరవు 

భద్రాచలం, వెలుగు: మూడు దశాబ్దాలుగా వద్దిపేట చెక్‌‌ డ్యాం నిర్మాణానికి  నోచుకోక 22  గ్రామాల్లో 7  వేల ఎకరాలు సాగునీరు అందక బీడువారిపోతున్నాయి.  పాలకులు మారుతున్నా  దీని నిర్మాణం మాత్రం ఎక్కడ వేసినా గొంగళి అక్కడ అన్న చందంగా తయారైంది.  పక్కనే గోదావరి, తాలిపేరు ఉన్నా పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. 

మూడు దశాబ్దాల నుంచి.. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూడు దశాబ్దాల క్రితం చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దిపేట చెక్​డ్యాం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.  వద్దిపేట, లెనిన్​కాలనీ, ఉంజుపల్లి, ఉప్పరిగూడెం, గన్నవరం, సింగసముద్రం, రేగుంట, కొయ్యూరు, ఆనందకాలనీ..  తదితర 22 గ్రామాల్లోని 7 వేల ఎకరాలకు ఈ చెక్‌‌ డ్యాం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రకటించారు.  ఇరిగేషన్​ ఇంజనీర్లతో సర్వే చేయించారు.  

రిజర్వ్ ఫారెస్ట్‌‌లో  ఉందని,  కేంద్ర అటవీశాఖ అనుమతి తప్పనిసరని సర్వే అధికారులు తేల్చి చెప్పారు.   దీంతో ఆ ప్రతిపాదన మూలనపడింది.  2004 లో కాంగ్రెస్​సర్కారులో  అప్పటి నాయకులు సీఎం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి దృష్టికి ఈ చెక్​డ్యాం విషయం తీసుకెళ్లారు.  జలయజ్ఞంలో భాగంగా ఈ డ్యాం కడతారని రైతులు ఆశించారు.  జడ్పీ చైర్మన్‌‌గా చందా లింగయ్య దొర ఉన్న సమయంలో రైతులు నెలరోజుల పాటు వద్దిపేట చెక్​డ్యాం కోసం దీక్షలు చేశారు.  

చర్ల నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర  చేసి ఐటీడీఏ పీవోకు వినతిపత్రం ఇచ్చారు.  రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కూడా ఎన్నికల అస్త్రంగా దీన్ని ఉపయోగించుకుంది.  సర్వే చేసి చెక్​ డ్యాం కాదు తాలిపేరుపై  లిఫ్ట్ కట్టి సాగునీరు అందిస్తామని బీఆర్​ఎస్​ ప్రభుత్వం హామీ ఇచ్చింది.  అదీ కార్యరూపం దాల్చలేదు.  మూడు దశాబ్దాలుగా వద్దిపేట చెక్​డ్యాం మురిపిస్తోంది. మరో వైపు బీఆర్​ఎస్​ సర్కారు సీతారామాప్రాజెక్టు, సీతమ్మసాగర్​ బ్యారేజీలు నిర్మించినా భద్రాచలం మన్యంకు చుక్కనీరు రాని పరిస్థితి.  కనీసం తాలిపేరు నదిపై చెక్​డ్యాం కట్టినా సాగునీరు వస్తుందని, రెండు పంటలు పండించుకునే అవకాశం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు. 

తాలిపేరు ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగంలో..

వద్దిపేట చెక్​డ్యాం సర్వేలన్నీ తాలిపేరు ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగం చూస్తోంది.  వద్దిపేట చెక్​ డ్యాం నిర్మాణ ప్రదేశం లొకేషన్‌‌ ఛత్తీస్‌‌గఢ్‌‌ స్టేట్​ బోర్డర్​లో ఉంది.  ఇంటర్​ స్టేట్​బోర్డర్​ సమస్యలు  వస్తాయని అంచనా వేస్తున్నారు.  లొకేషన్​ చేంజ్​చేసి వేరే ప్రాంతంలో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.  తాలిపేరు, సీతమ్మసాగర్​ బ్యాక్​ వాటర్​ను 22 గ్రామాలకు లిఫ్ట్ ల ద్వారా సాగునీరు అందించేందుకు యోచన చేస్తున్నారు. 

పాలకుల మాటలన్నీ నీటిమూటలే

ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా చర్ల మండలంలో రైతుల బతుకులు మారడం లేదు.  వద్దిపేట చెక్​డ్యాం కడతాం అంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి సర్వేల హడావుడి చేసి మభ్యపెట్టారు.  ఒకరు చెక్​డ్యాం, మరొకరు లిఫ్ట్ ఇలా మాయమాటలతో కాలం గడిపారు.  కానీ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. 
-  ప్రభుదాసు, రైతు, చర్ల