డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి .. బలవంతంగా వెళ్లగొట్టిన్రు

  • అడ్డుకొని నిరసన తెలిపిన గ్రామస్తులు
  • తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
  • నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తక్కలపాడులో ఘటన

శాలిగౌరారం (నకిరేకల్),  వెలుగు : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తక్కలపాడు గ్రామస్తులు ఆక్రమించుకున్న డబుల్‌‌‌‌  బెడ్‌‌‌‌ రూం ఇండ్లను మంగళవారం పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.  2003లో అప్పటి ప్రభుత్వం తక్కలపాడు గ్రామంలోని పేదలకు ఇందిరమ్మ పథకం కింద  ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇందులో లబ్ధిదారులు వారి స్థోమత మేరకు గుడిసెలు, రేకులు,  పెంకల ఇండ్లు నిర్మించుకున్నారు. 

 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక డబుల్  బెడ్  రూమ్  ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఖాళీ చేయించారు.  2017లో 28 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2018లో స్థానిక ఎమ్మెల్యే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా 2019లో ఇండ్ల నిర్మాణం పూర్తయింది.  అయినా ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో ఇందిరమ్మ పట్టాలు ఉన్న కొందరు ఆ ఇండ్లలోకి వెళ్లి ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయని ఇండ్లలో ఉండొద్దని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు వారికి చెప్పారు. వాళ్లు వినకపోవడంతో మంగళవారం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌  పాల్ సింగ్ ఆధ్వర్యంలో సీఐ రాఘవరావు, ఎస్సైలు సతీష్, రాజు, ఆర్ఐ నవీన్, సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని ఇండ్ల నుంచి బలవంతంగా ఖాళీ  చేయించారు. 

ఇంట్లోని సామాన్లను బయటపెట్టి  తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులు పోలీసు వెహికల్ కు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు.  పోలీసులు వారిని పక్కను నెట్టేందుకు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో  ధనలక్ష్మి అనే యువతి  అపస్మారస్థితిలోకి వెళ్లిపోవడంతో 108 లో అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ  గతంలో పట్టాలు పొందిన తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  1.50 లక్షలు ఇస్తేనే  ఇండ్లు ఇస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

అర్హత ఉన్నా తమకు ఇంకాఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడ్డారు. ఇప్పటికైనా తమకు ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలని  బాధితులు కోరారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ  త్వరలో గ్రామసభ నిర్వహించి  పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.