
హైదరాబాద్ లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. నారాయణగూడలో 233 ఫారెన్ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బషీర్ బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో... దిల్లీకి చెందిన 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ లను హైదరాబాద్ ఎన్ఫోర్స్ బీ టీం పట్టుకుంది. 174.5 లీటర్ల మద్యంతో సహా 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ బి టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం వల వేసి పట్టుకుంది. పట్టుకున్న విదేశీ మద్యం విలువ రూ.9,68,150 విలువ ఉంటుందని అంచనా వేశారు. నిందితుల నుంచి విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఒక కారు, రూ. 35 వేలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హరీష్ కుమార్ ఇర్వాణి అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారం చేసేవాడు. అయితే గత టెండర్లలో ఆయనకు మద్యం షాపు రాలేదు. దీంతో తనకున్న పరిచయాలతో టాటా వాటర్ గోదాములో దిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ... 14 నెలలుగా ఒక్కో బాటిల్ పై 15 వందల నుంచి 2వేల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడయిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఈర్వాణి, సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. దిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.