ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతూ అర్ధాంతరంగా ఇండియాకు వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండగా నిలిచింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో చదువు మధ్యలోనే ఆపేసి.. భారత్ కు వచ్చిన విద్యార్థులు క్వాలిఫై పరీక్షను రాయడానికి అనుమతించింది. ఇంటర్న్‌షిప్ పూర్తికాని విద్యార్థులు కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ రాయవచ్చని ప్రకటించింది.
ఇతర దేశాలలో మెడిసిన్ చదివిన విద్యార్థులు.. భారత్‌లో డాక్టర్‌గా కొనసాగాలంటే భారత ప్రభుత్వం నిర్వహించే విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (Foreign Medical Graduates Examination) పాసవ్వాలి. చాలామంది అక్కడ మెడిసిన్ పూర్తిచేసినా.. ఇక్కడ నిర్వహించే క్వాలిఫై పరీక్షను మాత్రం పాస్ అవ్వలేకపోతుండటం గమనార్హం.
మెడికల్ కోర్సుల కంప్లీట్పై ఎన్ఎంసీ ఫోకస్
ఉక్రెయిన్‌లో మెడికల్ కోర్సు లు చదువుతున్న మన స్టూడెంట్లు యుద్ధం కారణంగా నష్టపోకుండా చూసేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర హెల్త్ మినిస్ట్రీ, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఫోకస్ పెట్టాయి. ఎన్ఎంసీ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) రెగ్యులేషన్స్, 2021లో నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. ఆ సడలింపుల ప్రకారం చదువు పూర్తికాని విద్యార్థులు సైతం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసేలా అనుమతులిచ్చింది.