తాలిబన్లతో భారత్ టచ్ లో ఉందా?.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

తాలిబన్లతో భారత్ టచ్ లో ఉందా?.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్న తాలిబన్‌ ఫైటర్లు.. పలువురు కీలక నేతలతో చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే.. ఇతర దేశాలతో సంబంధాల విషయంలో తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అఫ్గాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా భారత్ కు వెళ్లే ఎగుమతులను తాలిబన్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో భారత్, అఫ్గానిస్థాన్ సంబంధాలు, తాలిబన్ల గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. 

అఫ్గాన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం మీదే దృష్టి పెట్టామని జైశంకర్ అన్నారు. తాలిబన్ల నాయకత్వం, ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇంత త్వరగా కామెంట్ చేయడం సరికాదన్నారు. 'కాబూల్ లో నెలకొన్న పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్నాం. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం.. హిస్టారికల్ గా అఫ్గాన్ తో ఉన్న సంబంధాలను కొనసాగిస్తాం. ప్రస్తుతం ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సేఫ్ గా స్వదేశానికి చేర్చడం మీదే ఫోకస్ పెట్టాం' అని జైశంకర్ పేర్కొన్నారు.