- ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు
- పాస్‌పోర్టులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
- వాళ్లిచ్చే వివరణ ఆధారంగా పాస్‌పోర్టులు రద్దు చేసి ఇండియాకు రప్పించే చాన్స్
హైదరాబాద్, వెలుగు : విదేశాలకు పారిపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు (ఎస్‌ఐబీ మాజీ చీఫ్), శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. పాస్ పోర్ట్‌లను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పాస్‌పోర్ట్ అథారిటీ ద్వారా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లిచ్చే వివరణ తర్వాత పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై పాస్‌పోర్ట్ అథా రిటీ నిర్ణయం తీసుకోనుంది. పాస్‌పోర్టులు రద్దు చేసిన వెంటనే ఆయా దేశాలు వీళ్లిద్దరినీ ఇండియాకు తిప్పి పంపే అవకాశం ఉంటుందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు..
కేసు దర్యాప్తులో భాగంగా వీరిద్దరిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు పాస్‌పోర్టులను పోలీసులు జప్తు చేశారు. కానీ, ఫిజికల్‌గా పాస్‌పోర్ట్‌లు నిందితుల వద్దే ఉండి పోయాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీ లేదా అమెరికా ఎంబసీలకు వెళ్లినప్పుడు వారి పాస్‌పోర్టులను సీజ్ చేస్తారు. పాస్‌పోర్ట్‌లను రివోక్ చేసిన తరువాత పాస్‌పోర్ట్ అథారిటీ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిస్తుంది. అనంతరం ఇన్వెస్టిగేషన్ అధికారులు అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తారని తెలిసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులు అక్కడే షెల్టర్ తీసుకుంటున్నారని సమాచారం అందించడం ద్వారా ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు.