
Student Visa Revocation: ప్రస్తుతం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు ట్రంప్ సర్కార్ దూకుడు చర్యలతో ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో చేసిన చిన్న తప్పులకు సైతం ఇప్పుడు వీసా రద్దులను వారు ఎందుర్కొంటున్నారు. పైగా సోషల్ మీడియాలో యాక్టివిస్టులకు సపోర్టుగా నిలవటాన్ని కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తూ నిఘా పెడుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు మెయిల్స్ ద్వారా తమ వీసాలు రద్దు చేయబడినట్లు ఇటీవల ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వీసాలను కోల్పోయిన వారిలో సగం మంది భారతీయ విద్యార్థులు ఉండటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.
అయితే ఈ పరిస్థితులపై అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తాజాగా ఒక స్టడీ రిపోర్టును విడుదల చేసింది. దీనిలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలో వీసాలు రద్దు చేయబడిన విదేశీ విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 327 మంది విద్యార్థులు తమ వీసాలను ట్రంప్ పరిపాలన రద్దు చేయటం కారణంగా న్యాయస్థానాన్ని సంప్రదించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. దీని తర్వాత ఎక్కువగా వీసాలను కోల్పోయిన వారిలో చైనా విద్యార్థులు ఉన్నారని చెప్పింది. స్టూడెంట్ వీసాలు రద్దైన వారిలో 14 శాతం మంది చైనా విద్యార్థులు ఉన్నట్లు డేటా వెల్లించింది.
అయితే మెుత్తం వీసా కోల్పోయిన వారిలో 50 శాతం మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(OPT)లో ఉన్నవారిని ప్రభావితం చేశాయని అధ్యయనం వెల్లడించింది. ఇదే క్రమంలో ప్రభావితమైన విద్యార్థుల్లో ఇండియా, చైనా తర్వాత దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన విద్యార్థులు సైతం ఉన్నారని వెల్లడైంది. అధికారిక డేటా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులు ఉన్నారు. 2023-24 అకెడమిక్ సంవత్సరంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3 లక్షల 32వేలుగా ఉన్నట్లు తేలింది. వీరిలో 97వేల మందికి పైగా విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రామ్ కింద నమోదై ఉన్నారు.
కేవలం గడచిన వారంలో అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో 118 మంది వీసాలను తిరస్కరించినట్లు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం వెల్లడైంది. ప్రభావితం అయిన విద్యార్థులకు ఈ విషయం వెల్లడించబడింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లిస్టులో వీరి పేర్లను తొలగించబడ్డాయి. మెుత్తం జనవరి 20 నుంచి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి మెుత్తం 4వేల 736 మంది విద్యార్థుల పేర్లు పైన పేర్కొన్న లిస్టు నుంచి తీసివేయబడ్డాయి.