భారతదేశ విదేశీ వ్యాపారం.. ప్రధాన ఎగుమతులు, దిగుమతులు ఇవే..

భారతదేశ విదేశీ వ్యాపారం.. ప్రధాన ఎగుమతులు, దిగుమతులు ఇవే..

మూడో ప్రపంచ దేశాలు ఎక్కువగా గతంలో వలసవాదానికి లోనయ్యాయి. సామ్రాజ్యవాద దేశాలు విదేశీ వ్యాపారం ద్వారా మూడో ప్రపంచ దేశాలను దోపిడీ చేశాయి. 1940, 1950వ దశకాలలో సామ్రాజ్యవాద దేశాలు ప్రాథమిక వస్తువుల వినియోగదారుగా, మాన్యుఫాక్చర్డ్ వస్తువుల ఉత్పత్తిదారుగా రెండు విధాలుగా లబ్ధి పొందాయి. మరోవైపు వలసవాదానికి గురైన దేశాలు మాన్యుఫాక్చర్డ్ వస్తువుల వినియోగదారుగా, ముడిపదార్థాల ఉత్పత్తిదారుగా రెండు విధాలా నష్టపోయాయి. దీనివల్ల ప్రాథమిక వస్తువుల ధరలు తగ్గి, మాన్యుఫాక్చర్డ్ వస్తువుల ధరలు పెరగడంతో వెనుకబడిన దేశాలకు వర్తక నిబంధనలు క్షీణించాయి. అందుకే, స్వాతంత్ర్యం తర్వాత ఈ దేశాలు దేశీయ మార్కెట్​పై దృష్టి సారించాయి. దేశంలో భారీ పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చి తయారీ వస్తువుల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించాయి. అంటే ఇన్​వార్డ్ ఓరియెంటెడ్ పాలసీకి ప్రాధాన్యత ఇచ్చాయి. దేశీయ పరిశ్రమలకు రక్షణ ఇవ్వడం ద్వారా భారీగా దిగుమతుల ప్రతిస్థాపనకు ప్రాధాన్యత ఇచ్చాయి. దిగుమతులు, పెట్టుబడులపై ప్రత్యక్ష నియంత్రణలు విధించి, వినిమయ రేటును పెంచాయి. 

1960వ దశకంలో జపాన్, సింగపూర్, హాంకాంగ్, తైవాన్, దక్షిణకొరియా దిగుమతులను సరళీకరించి ఎగుమతులను ప్రోత్సహించడంతో మంచి ప్రగతి కనబర్చాయి. ఈ విజయాలతో అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్​, ఆర్థికవేత్తలు, దిగుమతుల సరళీకరణ, ఎగుమతుల ప్రోత్సాహకాలను సమర్థించారు. మన దేశంలో ఈ దిశగా 1991లో అనేక చర్యలు చేపట్టి, ఆర్థిక వ్యవస్థను విదేశీ వ్యాపారానికి అనుమతించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేశారు. 

భారత్​లో ఎగుమతులు, దిగుమతులు

ప్రణాళికా కాలంలో భారత ఎగుమతులు, దిగుమతులు రెండు పెరుగుతూ వచ్చాయి. 1950–51లో భారత ఎగుమతులు 1.269 బిలియన్ డాలర్లు, దిగుమతులు 1.273 బిలియన్ డాలర్లు కాగా వర్తకపు లోటు 0.004 బిలియన్ డాలర్లు. 2021–22లో ఎగుమతులు 429.2 బి.డా., దిగుమతులు 618.6 బి.డా., వర్తకపు లోటు 189.5 బి.డా. అంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. ఫలితంగా వర్తకపు లోటు పెరిగింది. భారత ఎగుమతులు, దిగుమతులు ప్రణాళికా కాలంలో పెరుగుతూ వచ్చాయి. మరోవైపు వ్యాపార లోటు కూడా పెరిగింది. మొత్తం ప్రణాళికా కాలంలో రెండు సంవత్సరాలు 1972–73లో 135 మిలియన్ డాలర్లు, 1976–77లో 76 మిలియన్ డాలర్ల వ్యాపార మిగులు కనిపించింది. 1990–91లో వర్తకపు లోటు 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. 1991–92లో ఆంక్షలు విధించడంతో లోటు తగ్గినా పారిశ్రామిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. 1992–93లో దిగుమతుల సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. మళ్లీ వ్యాపార లోటు పెరిగింది. వర్తక లోటు 2019–20లో 161, 2020–21లో 102, 2021–22లో 191 బిలియన్ డాలర్లకు చేరింది. 2022–23లో వ్యాపార లోటు 276 బిలియన్ డాలర్లు, స్వాతంత్ర్యం తర్వాత ఇదే గరిష్ట స్థాయి రికార్డు. 

విదేశీ వ్యాపార సంయోగం

ఒక దేశ ఎగుమతులు, దిగుమతుల సంయోగాన్ని పరిశీలిస్తే ఆ దేశ వ్యాపార పురోగతి, నిర్మాణాత్మక మార్పుల వేగం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక దేశం ఆహార ధాన్యాలు, ముడిపదార్థాలు దిగుమతి చేసుకుని తయారైన వస్తువులు, యంత్రాలు, మూలధన ఎక్విప్​మెంట్ ఎగుమతి చేస్తే  ఆ దేశం అధిక ఆర్థికాభివృద్ధి స్థాయిలో ఉందని అర్థం. అలాకాకుండా ప్రాథమిక వస్తువులైన జనపనార, తేయాకు, ప్రత్తి, పంచదార వంటి వస్తువులను ఎగుమతి చేసి తయారైన వస్తువులను, యంత్రాలను దిగుమతి చేసుకుంటే అది వెనుకబడి ఉందని అర్థం. ప్రణాళికలకు ముందు తేయాకు, జనపనార, ప్రత్తి, మాంగనీస్, మైకా వంటి ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేసేవాళ్లం. ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత మన వ్యాపార సంయోగంలో మార్పు వచ్చింది. 

దిగుమతుల కూర్పు

1947–48లో భారత ప్రధాన దిగుమతులు యంత్రాలు, నూనెలు, పప్పు దినుసులు, ప్రత్తి, రసాయనాలు, మందులు. ప్రణాళిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా రెండో ప్రణాళిక నుంచి దిగుమతుల కూర్పు మారింది. కారణం మహల్​నోబీస్ నమూనా. మూలధన వస్తువులు, మౌలిక పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా పెద్ద  మొత్తంలో మూలధన ఎక్విప్​మెంట్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వీటిని నిర్వహించడానికి విడిభాగాలు, యంత్రాలు, దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వీటిని మెయింటెనెన్స్ ఇంపోర్ట్స్ అంటారు. కాలక్రమేణ ఆహార దిగుమతులు తగ్గాయి. తయారీ ఉత్పత్తులకు కావాల్సిన మధ్యంతర వస్తువుల దిగుమతులు పెరిగాయి. మూలధన వస్తువుల దిగుమతులు తగ్గాయి. 

ఎ. 1960–61లో పెట్రోలియం ఆయిల్ లుబ్రికేట్స్ దిగుమతులు మొత్తం దిగుమతిలో 6.1 శాతంగా ఉండేవి. 1980–81 నాటికి 41.9 శాతానికి పెరిగాయి.  అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గడంతో 1991–92లో  మళ్లీ దిగుమతుల్లో ఆయిల్ వాటా 25 శాతానికి తగ్గాయి. 2021–22లో 26.3 శాతానికి చేరాయి.

దేశ 10 ప్రధాన వస్తు దిగుమతులు

పెట్రోలియం, క్రూడ్ అండ్  ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, బంగారం, మెషినరీ, ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్, కోలో, కోక్ అండ్ బ్రిక్విట్స్, పెరల్స్, ప్రిసియస్, సెమీ ప్రిసియస్ స్టోన్స్, ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ కెమికల్స్, ట్రాన్స్​పోర్ట్ ఎక్విప్​మెంట్, ఆర్టిఫిషియల్ రెసిన్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్, వెజిటబుల్ ఆయిల్.

ఎగుమతుల కూర్పు

వ్యవసాయ అనుబంధ ఎగుమతులు తగ్గుతూ, మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. ఉదాహరణకు 1960–61లో వ్యవసాయం అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 44 శాతం ఉండేవి. 2019–20 నాటికి 11.2 శాతానికి పడిపోయాయి. మరోవైపు మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల ఎగుమతులు ఇదేకాలంలో 45 నుంచి 71.3 శాతానికి పెరిగాయి. సుమారు 3/4వ వంతు ఇవే అందిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వెనుకబడిన, అల్పాభివృద్ధి చెందిన, ప్రాథమిక వస్తు ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్పు చెందుతున్నది. 
ఎ.1960–61లో ఎగుమతుల్లో 21శాతంగా ఉన్న జనపనార ప్రస్తుతం 0 శాతానికి తగ్గాయి.
బి. 1960–61లో రెండో ముఖ్య ఎగుమతి తేయాకు 19 శాతం ఉండేది. ప్రస్తుతం 0.3 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం తేయాకు లేదా టీ సంపాదన జనపనార కంటే ఎక్కువ.
సి. ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 1960–61లో 3.4 శాతంగా ఉండేది. 2021–22 నాటికి 26.58 శాతానికి పెరిగాయి. నేటి భారత ఎగుమతుల ఆర్జనలో ప్రథమ స్థానం ఇంజినీరింగ్ వస్తువులదే.

దేశ 10 ప్రధాన వస్తువుల ఎగుమతులు

ఇంజినీరింగ్ వస్తువులు, పెట్రోలియం ప్రొడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువలరీ, ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ కెమికల్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, రెడీమెడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాటన్ యార్న్, ప్యాబ్రిక్స్, హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్ అండ్ లినోలియం, రైస్.