ధర్మసాగర్ మండలంలో ఫారెస్ట్, రెవెన్యూ భూముల సర్వే షురూ

 ధర్మసాగర్ మండలంలో ఫారెస్ట్, రెవెన్యూ భూముల సర్వే షురూ

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు ఇనపరాతి గుట్టల భూముల్లో ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. తమ పట్టా భూములను ఫారెస్ట్ భూములంటూ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సైతం భూములను సర్వే చేసి తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య వివాదంలో ఉన్న భూములను సర్వే చేయించి రైతులకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఈ సర్వేలో రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొనాలని ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే ప్రారంభించారు. ఈ సర్వే రేపు కూడా జరుగుతుందని స్థానిక తహసీల్దార్ సదానందం తెలిపారు. సర్వేలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భిక్షపతి, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ అనిత, సర్వేయర్ సురేందర్, రైతులు పాల్గొన్నారు.