- రెండేండ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిన విస్తీర్ణం
- 12 జిల్లాల్లో తగ్గితే.. -మరో 6 జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం
- ఆదిలాబాద్‌లో ఎక్కువగా 115.5 చ. కి. మీ. మేర తగ్గుదల
- భద్రాద్రి కొత్తగూడెంలో 95.5 చ. కి. మీ. తగ్గిన అడవి
- స్మగ్లింగ్, పోడు, అడవుల ఆక్రమణ, ప్రకృతి విపత్తులతో నష్టం
- ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్‌లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది. రెండేండ్లలో100 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోయింది. 12 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. మిగతా జిల్లాల్లో అడవుల విస్తీర్ణం పెరిగినా.. తగ్గిన విస్తీర్ణం మేరకు సమతుల్యత నమోదు కాలేదు. దీంతో ఓవరాల్‌గా రాష్ట్రంలో 2021తో పోలిస్తే 2023 నాటికి 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్– 2023లో ఈ విషయం వెల్లడైంది.
ఆదిలాబాద్, కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, మహ బూబాబాద్, ములుగు, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో ఫారెస్ట్ కవర్ తగ్గినట్టు రిపోర్ట్ తేల్చింది. అత్యధికంగా 115.50 చదరపు కిలోమీటర్ల మేర ఆదిలాబాద్‌లో అడవులు తగ్గిపోయినట్టు వెల్లడైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55 చదరపు కిలోమీటర్లు, నిర్మల్‌లో 45.37, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 44.61, మహబూబాబాద్‌లో 26.98, ములుగులో 25.91, ఖమ్మంలో 25.76, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయింది.
వాటితోపాటు నిజామాబాద్, జనగామ, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోనూ అటవీ విస్తీర్ణంలో తగ్గుదల నమోదైంది. కాగా, హైదరాబాద్ నగరంలోనూ ఫారెస్ట్కవర్ తగ్గినట్టు రిపోర్ట్ తేల్చింది. 2021లో 81.81 చదరపు కిలోమీటర్ల మేర నగరంలో అడవులుండగా.. 2023 నాటికి అది 80.20 చదరపు కిలోమీటర్లకు పడిపోయిందని రిపోర్ట్‌లో తేల్చారు. అంటే 1.61 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గాయి.
మొత్తం అడవులు 21,179.04 చదరపు కిలోమీటర్లు
రాష్ట్రంలో 21,179.04 చదరపు కి.మీ. మేర అడవులు న్నట్టు రిపోర్ట్‌లో వెల్లడించారు. అందులో దట్టమైన అడ వులు 1,613.32 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా.. మధ్యస్థాయి దట్టంగా ఉన్న అడవులు 8,909.90, ఓపెన్ ఫారెస్ట్ 10,655.82 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నది. అయితే, 2021లో మొత్తం అడవుల విస్తీర్ణం 21,279.46 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడది 21,179.04 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,861.66 చదరపు కిలోమీటర్ల అడవులున్నాయి.
ఆ తర్వాత ములుగు జిల్లాలో 2,699.39, నాగర్‌కర్నూల్‌లో 1,932.53, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 1,778.26, మంచిర్యాలలో 1,564.93, జయశంకర్ భూపాలపల్లిలో 1,157.39, ఆదిలాబాద్‌లో 1,145.26, నిర్మల్‌లో 1,085.02 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. దట్టమైన అడవులు భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ములుగు, మహబూబాబాద్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో ఎక్కువగా విస్తరించి ఉన్నట్టు రిపోర్ట్‌లో వివరించారు.
కార్చిచ్చులు ఎక్కువైనయ్
నిరుడుతో పోలిస్తే కార్చిచ్చులు కొంచెం పెరిగినట్టు రిపోర్ట్ తేల్చింది. 2022–23లో 13,117 కార్చిచ్చు ఘటనలు నమోదు కాగా.. 2023–2024లో 13,479 ఘటనలు జరిగాయి. అయితే, పలు జిల్లాల్లో మాత్రం కార్చిచ్చు ఘటనలు చాలా ఎక్కువగా జరిగాయని రిపోర్ట్ తేల్చింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 2,600 కార్చిచ్చు ఘటనలు జరిగాయి. నిరుడు అదే జిల్లాలో 1,942 ఘటనలు జరగ్గా.. ఇప్పుడు దాదాపు 700 వరకు ఇన్సిడెంట్లు పెరిగాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,597 కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. అంతకుముందు ఏడాది 1,783 కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకున్నాయి.
మహబూబాబాద్‌లో 1,245, నాగర్‌కర్నూల్‌లో 1,185, జయశంకర్ భూపాలపల్లిలో 1,006 చొప్పున కార్చిచ్చులు సంభవించాయి. కాగా, కార్చిచ్చు ప్రమాదం అత్యధికంగా పొంచి ఉన్న ప్రాంతం 1,517 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. వెరీ హై ప్రోన్ ఏరియాలో 6,003 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలో కార్చిచ్చుల ప్రభావం ఉన్నట్టు తేలింది. హై ప్రోన్ ఏరియాలో 4,319 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని వెల్లడైంది.
పరిణామాలు తీవ్రం
అడవుల విస్తీర్ణం తగ్గితే పర్యావరణంపై తీవ్ర పరిణామా లుంటాయని అధికారులు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా యానిమల్–హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. అడవులు తగ్గితే అక్కడ నివసించే వన్యప్రాణులు జనావాసాలపైకి వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్దపులులు గ్రామాలు, పొలాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పొలంలో పనిచేసుకుంటున్న మహిళపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఏడాది జనవరిలోనూ మరో మహిళపైనా పెద్దపులి దాడి చేసి, ప్రాణాలు బలిగొన్నది.
ALSO READ : రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు!
ఇటు ఆదిలాబాద్‌తోపాటు పలు జిల్లాల్లోనూ గ్రామాల్లోకి పులులు వస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట పెంపుడు జంతువులపై దాడులు చేసి చంపుతున్నాయి. అడవులు తగ్గిపోవడం వల్ల వాటి నివాసంపై ప్రభావం పడి.. అవి జనావాసాల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్ష సంపద కనుమరుగవుతుందని పేర్కొంటున్నారు. క్లైమేట్ చేంజ్కూ అది దారి తీస్తుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అడవులు తగ్గిపోవడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుందని అంటున్నారు.
వాహనాలు, పరిశ్రమల నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ను అడవులు శోషించుకుంటాయి. అడవులు తగ్గిపోతే కార్బన్ డయాక్సైడ్ ను శోషించుకునే సామర్థ్యం తగ్గి హీట్‌వేవ్స్ ఘటనలు పెరుగుతాయని, వర్షపాతంపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అక్రమంగా కలపను నరకడం వల్ల అరుదైన వృక్ష జాతులైన ఎర్రచందనం, టేకు ఇతర విలువైన వృక్ష సంపదను కోల్పోతామని చెప్తున్నారు.
అడవులు ఎందుకు తగ్గుతున్నయంటే?
దక్షిణాది జిల్లాలతో పోలిస్తే ఉత్తరాది జిల్లాల్లోనే అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్నది. అడవుల ఆక్రమ ణ, అక్రమంగా చెట్లను నరకడం, కలప స్మగ్లింగ్, అటవీ ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ, పోడు హక్కుల వంటి వి రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా రిపోర్ట్‌లో అధికారులు తేల్చారు. వీటితో పాటు ప్రకృతి విపత్తులు, పెను గాలులు, కొండ చరియలు విరిగిపడడం వంటి కారణాలతో అడవులు తగ్గిపో తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల ఏటూరు నాగరంలో ఒక్కసారిగా 500 ఎకరాల్లో 80 వేలకుపైగా చెట్లు నేలమ ట్టమైన సంగతి తెలిసిందే. దానికి కారణం పెను గాలులు వీయడమేనని ప్రాథమికంగా తేల్చారు.
అయితే కొద్ది రోజుల క్రితం ములుగుతోపాటు పలు జిల్లాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దానికి కారణాల ను విశ్లేషించే పనిలో సైంటిస్టులు ఉన్నారు. చెట్లు నేలకొరగడం వెనుక భూమిలోపల ప్లేట్లు అడ్జస్ట్ అవ్వడం కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షాలు, వరదలతో అడవుల్లో ని నేల కొట్టుకుపోవడం వల్ల కూడా అటవీ విస్తీర్ణం తగ్గేందుకు ఆస్కారం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ జిల్లాల్లో పెరిగింది..
పలు జిల్లాల్లో అడవుల విస్తీర్ణం కొంచెం పెరిగిన ట్టు రిపోర్ట్‌లో వెల్లడించారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 54.70 చదరపు కి.మీ. విస్తీర్ణంలో అడవుల పెరుగుదల నమోదైనట్టు తేల్చారు. ఆ జిల్లాలో ప్రస్తుతం 637.80 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో 50.53 చదరపు కి.మీ., మహబూబ్‌నగర్‌లో 34.96, సంగారెడ్డిలో 33.67, మంచిర్యాల జిల్లాలో 28.86 చదరపు కిలో మీటర్లు, నల్గొండలో 26.41, సిద్దిపేటలో 22.04 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. మిగతా జిల్లాల్లో 10 చదరపు కిలోమీటర్ల లోపున అడవులు పెరిగినట్టు రిపోర్ట్‌లో వెల్లడైంది.