
- ఖానాపూర్ లో ఎఫ్‌డీవో పోస్టు ఖాళీ
- కరువైన పర్యవేక్షణ
- జోరుగా సాగుతున్న కలప అక్రమ రవాణా
ఖానాపూర్, వెలుగు: దట్టమైన అడవులకు పేరుగాంచిన ఖానాపూర్ పై పాలకులు, అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారు. ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 5 అటవీ శాఖ రేంజ్ లు ఉండగా గతేడాది జూన్ లో ఇక్కడ పనిచేసిన ఎఫ్‌డీవో కోటేశ్వరరావు ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్ ఎఫ్‌డీవో ఎం.భవానీ శంకర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 5 రేంజ్‌లు ఉన్న ఖానాపూర్ డివిజన్లో కీలక పోస్టు ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి అధికారులకు దిశానిర్దేశం లేకుండా పోయిందని, సంబంధిత శాఖ పనులు సకాలంలో జరగడం లేదు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా?
కీలక పోస్టు ఖాళీగా ఉండడంతో డివిజన్ పరిధి లోని రేంజ్‌లలో అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపించి కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. డివిజన్ పరిధిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన డివిజన్ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉన్నా పాలకులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎఫ్‌డీవోను నియమించి అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.