- ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్లు
- భయంతో పోడు భూముల్లోకి వెళ్లలేం
- వెంట బలగాలు పంపాలి.. లేకుంటే విధుల బహిష్కరణ
- పోడు భూముల సర్వే చేయలేమంటున్న అధికారులు
- తమతో భద్రతా బలగాలను పంపాలి.. లేదంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక
- శ్రీనివాస్ రావుకు ఫారెస్ట్ అధికారుల నివాళి
వెలుగు నెట్‌వర్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్యపై అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ రక్షణ గురించి పట్టించుకోకపోవడం వల్లే రేంజర్ హత్య జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రమంతటా ఫారెస్ట్ సిబ్బంది శ్రీనివాస్ రావుకు నివాళి అర్పించారు. హత్యకు నిరసనగా పలు చోట్ల నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు తీశారు. ఫీల్డ్ డ్యూటీలు చేసే తమకు ఆయుధాలు ఇవ్వాలని, అంతవరకు పోడు సర్వే చేయలేమని తెగేసి చెప్పారు. అవసరం అయితే విధుల బహిష్కరిస్తామని హెచ్చరించారు. బుధవారం జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీస్‌లో శ్రీనివాస్ రావు సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధర్మపురి రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, తమకు వెపన్స్ ఇవ్వకపోతే పోడు భూముల సర్వే చేసేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ రావు లాంటి డైనమిక్ ఆఫీసర్ పరిస్థితే ఇలా ఉంటే, మిగతా ఉద్యోగులు డ్యూటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. గతంలో అనిత, ఇప్పుడు శ్రీనివాస్‌రావు హత్యకు గురవ్వడం బాధాకరమన్నారు. తమకు వెపన్స్ ఇవ్వాలని లేదంటే సాయుధ బలగాలను తోడుగా పంపాలని కోరారు. గ్రామ సభలకు వెళ్లేందుకు కూడా బీట్ ఆఫీసర్లు భయపడుతున్నారని చెప్పారు. రేంజ్ ఆఫీసర్లకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన..
శ్రీనివాస్‌రావును హత్యకు నిరసనగా కొత్తగూడెంలోని కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ములుగు ఫారెస్ట్ ఆఫీసు నుంచి బస్టాండ్ వరకు ఫారెస్ట్ సిబ్బంది ర్యాలీ తీశారు. శ్రీనివాస్‌రావు నిబద్ధత కలిగిన ఆఫీసర్ అని, అడవులను సంరక్షించడం కోసం నిత్యం తపించేవారని డీఆర్వో అశోక్ చక్రవర్తి అన్నారు. ఆయనను హత్య చేసిన గొత్తి కోయలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎఫ్‌డీవో జోగేందర్, డీఆర్‌వో సాంబయ్య, ఎఫ్ఆర్‌వో శంకర్, ఎఫ్‌ఎస్‌వో బాలాజీ అన్నారు. తమ రక్షణకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విధులు బహిష్కరిస్తామని ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్‌లో అటవీ శాఖ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీరయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అటవీ అధికారులు, సిబ్బందికి వెంటనే ఆయుధాలు ఇవ్వాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సర్కిల్ ప్రెసిడెంట్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అచ్చంపేటలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిర్మల్‌లో ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ రావు హత్య ప్రభుత్వ హత్యేనని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపూరావ్, రాజ్ గౌడ్ సేవా సమితి అధ్యక్షుడు పెందురు ప్రభాకర్ అన్నారు.
చంద్రుగొండలోబంద్ సక్సెస్
శ్రీనివాసరావు హత్యకు నిరసనగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం చంద్రుగొండ బంద్ సక్సెస్ అయింది. మున్నూరు కాపు సంఘం సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి చండ్రుగొండ మెయిన్ సెంటర్‌లో ప్రదర్శన నిర్వహించారు. రేంజర్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు నర్సింహరావు, భూపతి శ్రీనివాస్, రామారావు, రమేశ్ పాల్గొన్నారు.